calender_icon.png 30 September, 2025 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జ్ఞాపకానికి మిగిలిన వెలుగు

29-09-2025 12:00:00 AM

చిన్నప్పుడు పట్నం నుంచి నాన్న తెచ్చిన నల్లఏనుగుబొమ్మ, స్టోర్ రూమ్ తలుపు పక్కన కనిపించింది.

దుమ్ము పట్టి కాస్త వెలిసిపోయింది కానీ,

దాంతో ఆడుకున్న జ్ఞాపకాలు మాత్రం,

ఇంకా నాలో సజీవంగానే ఉన్నాయి.

ఆ బొమ్మ నాతో మాట్లాడేది.

నన్ను చూసి ముక్కుతో నవ్వేది.

అప్పట్లో అది ఆటబొమ్మ.

ఇప్పుడది జ్ఞాపకాల బరువు!

అక్క కోసం తెచ్చానని నాన్న చెబితే,

అందర్నీ విసిగించి, ఏడిపించి,

మంకుపట్టు పట్టి, పెంకుటిల్లు ఎక్కి,

ఇల్లు పీకి పందిరేసిన అల్లరంతా గుర్తొచ్చి..

గది మూలన ఉన్న ఆ బొమ్మ వైపు

నడిచే కాళ్లు ఒక్కసారిగా బరువెక్కాయి.

ఎవ్వరికీ దాన్ని తాకే అర్హతే లేదనే వాడ్ని.

తినేప్పుడూ పడుకునేప్పుడు వదల్లేదు.

స్నేహితులకు కాలరెగరేస్తూ చెప్పేవాడ్ని

‘నా దగ్గర ఓ నల్లఏనుగు బొమ్మ ఉందని’

ఒక్కసారి చూసిస్తారా? అంటే ఇవ్వనని

పరిగెత్తే పసితనంలో ఎంత అందం?!

చిట్టి గజరాజు గట్టి కన్ను విరిగిపోతే,

నాన్న - నేను.. డొక్కు స్కూటర్ మీద

ఎన్ని గల్లీలు తిరిగి రిపేర్ చేయించాం?

తోక తెగిపోతే - కాలు విరిగిపోతే,

అమ్మను ఎంతగా విసిగించి సరి

చేయించా ? ఎన్ని దెబ్బలు తిన్నా?

అంతా గుర్తొచ్చి నవ్వొచ్చింది.

కాదు ఏడుపొచ్చింది..

కాదు.. కాదు ఆ రెండూ కలిసే వచ్చాయి.

నా హృదయంలో మెరిసే బాల్య స్మృతిని

రాత్రి దాకా నా గదిలోనే భద్రంగా దాచా.

ఏనుగు బొమ్మను మాత్రం

నా పుత్రరత్నం చెత్తబుట్టలోకి చేర్చాడు..