18-09-2025 12:23:48 AM
దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట, మదనాపూర్ మండలల్లో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సమీక్ష
వనపర్తి, సెప్టెంబర్ 17 ( విజయక్రాంతి ) : ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం చేయగలమని దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో కొత్తకోట, మదనాపూర్ మండలాలకు సంబంధించి ప్రజల సమస్యలపై జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కొత్తకోట మండలానికి చెందిన పలువురు మాట్లాడుతూ తమ మండలంలో విద్యుత్ అంతరాయం, డ్రైనేజీల నిర్మాణం, తాగునీటి సరఫరా, మునిసిపల్ కాంప్లెక్స్ భవనం ఏర్పాటు, సంతకు స్థలం కేటాయింపు విషయం సహా పలుసమస్యలను ఎమ్మెల్యే, కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా చనిగచెరువుకు సంబంధించి వెంకటగిరి దేవాలయానికి వెళ్లేందుకు రోడ్డును ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరి దేవాలయానికి సంబంధించి రహదారి నిర్మాణానికి అదేవిధంగా అక్కడే సొంత స్థలం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపడం జరిగిందని చెప్పారు.
అదేవిధంగా పలువురు వ్యక్తం చేసిన విధంగా విద్యుత్ అంతరాయం సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని జిల్లా కలెక్టర్లు కోరారు. అవసరమైన చోట కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా కొన్ని గ్రామాల్లో 11 కెవి లైన్ సమస్యలు ఉన్నాయని వాటిని షిఫ్ట్ చేయాలని తెలియజేశారు. చిన్న చిన్న కారణాల ద్వారా కొన్ని గ్రామాలకు నిరంతరం అంతరాయం జరుగుతుందని ఆ సమస్యను పరిష్కరించాలని తెలియజేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, కొత్తకోట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్, కథలప్ప, జిల్లా అధికారులు, జర ప్రజాప్రతినిధులు తదితరులుపాల్గొన్నారు.