calender_icon.png 12 September, 2025 | 12:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకృతి వనాన్ని పెంచాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే

11-09-2025 10:24:06 PM

ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ప్రకృతి వనాన్ని పెంచాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉందని అటవీశాఖ అధికారులను ఉద్దేశించి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) పేర్కొన్నారు. గురువారం అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, జిల్లా ఫారెస్ట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అడవులను సంరక్షణ చేయడంలో విధినిర్వహణలో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన చెప్పారు. తమ ప్రాణాలను అడ్డుపెట్టి అడవులను కాపాడుకోవడానికి అటవీశాఖ సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు.

అడవులు కాపాడుకుంటేనే వర్షాలు బాగా కురిసి, రైతులు సంతోషంగా ఉంటారని చెప్పారు. అటవీశాఖ అధికారుల చేతనే టూరిజం శాఖ అభివృద్ధి చెందుతుందన్నారు. ఇకో టూరిజంను ప్రచారం చేయడంలో మీ పాత్ర గొప్పదని అన్నారు.  మన మహబూబ్ నగర్ లో విస్తారమైన అడవులు ఉన్నాయని,  ఇప్పుడు చిరుతలు కూడా బాగా పెరిగి జనావాసాలకు వస్తున్నాయని ఆయన చెప్పారు. వన్యప్రాణులను రక్షించుకుంటూ, ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా సమతుల్యత తోటి పనిచేస్తూ మీ ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించాలని ఆయన సూచించారు.  ఈ కార్యక్రమంలో మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, డిఎఫ్ఓ సత్యనారాయణ, ఎఫ్ డి ఓ గణేష్, ఎఫ్ ఆర్ ఓ అబ్దుల్ హై, కమాలుద్దీన్ మరియు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.