12-09-2025 12:31:09 AM
అధికారులకు మంత్రి వివేక్ వెంకటస్వామి సూచన
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి) : పరిశ్రమల్లో భద్రతపై అధికారులు దృష్టి పెట్టాలని కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో గురువారం ఎంసీఆర్ హెచ్‌ఆర్డీలో పరిశ్రమల్లో ఉద్యోగ భద్రతపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ఘటన యజమానులకు ఒక కేస్ స్టడీ లాంటిదని పేర్కొన్నారు.
కంపెనీలో సేఫ్టీ ఎన్విరామెంట్ ఉన్నపుడే కార్మికులు పని చేయగలుగుతారని తెలిపారు. జీరో ఆక్సిడెంట్ ఫ్యాక్టరీస్‌గా ప్రమాణాలు పెంచాలని, దీనిలో భద్రత అధికారుల పాత్ర కీలకమని చెప్పారు. రెడ్ కేటగిరీ కంపెనీలను గుర్తించి నోటీసులు ఇస్తామన్నారు.
ప్రమాదం జరిగితే సంబంధిత శాఖ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పరిశ్రమల భద్రతపై సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రతి నెల కార్మికులకు భద్రతపై శిక్షణ ఇవ్వాలని సూచించారు.