12-09-2025 12:36:42 AM
అనుమతి లేకుండా తన ఫొటోలు వాడుకుంటున్నారంటూ నటి ఐశ్వర్యరాయ్ ఢిల్లీ హైకోర్టును ఇటీవల ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై ఐశ్వర్యరాయ్ భర్త, నటుడు అభిషేక్ బచ్చన్ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఐశ్వర్య కేసులో కోర్టు గురువారం తీర్పునిచ్చింది. ఇకపై ఐశ్వర్య రాయ్ అనుమతి లేకుండా ఆమె ఫొటోలను వాడటానికి వీల్లేదని స్పష్టం చేసింది.
ఐశ్వర్య ఫొటోలు దుర్వినియోగం చేయడం వల్ల ఆమె గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బ తీసినట్టు అవుతోందని కోర్టు పేర్కొంది. ఇది ఆమెకు ఆర్థికంగానూ నష్టం చేకూర్చినట్టు అవుతుందని తెలిపింది. ఈ మేరకు ఐశ్వర్యరాయ్ ప్రచార, వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఐశ్వర్య పిటిషన్‌ను విచారించిన కోర్టు.. అందులోని యూఆర్‌ఎల్‌లను తొలగించి బ్లాక్ చేయాలని ఈగూ వెబ్ సైట్లు, గూగుల్ సహా ఇతర ప్లాట్‌ఫారాలను ఆదేశించింది.
నోటీసులు అందిన 72 గంటల్లోపు సదరు యూఆర్‌ఎల్స్‌ను బ్లాక్ చేయా లని సూచించింది. ఆ యూఆర్‌ఎల్స్‌ను ఏడు రోజుల్లో బ్లాక్ చేసేలా ఆదేశాలివ్వాలని కేంద్ర ఐటీ, సమాచార శాఖకు కోర్టు సూచించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ జనవరి 15న జరగనుంది.