17-09-2025 12:15:28 AM
రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్
సిద్దిపేట కలెక్టరేట్, సెప్టెంబర్ 16: ఆర్టిఐ చట్టాన్ని అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర సమాచార కమిషనర్ డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. సిద్దిపేట కలెక్టరేట్ లో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, సిద్దిపేట జిల్లాలో తక్కువ దరఖాస్తులు పెండింగులో ఉండటంపై జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 17 వేల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి జీరో చేయడం లక్ష్యమని తెలిపారు. ప్రతి సంవత్సరం 1.5 లక్షల మంది ఆర్టిఐ ద్వారా సమాచారం కోరుతున్నారని, తెల్ల రేషన్ కార్డు దారులు ఉచితంగా సమాచారం పొందగలరని, ఇతరులు కోర్ట్ ఫీజు ద్వారా పొందవచ్చని చెప్పారు. అధికారులు 4(1బి), 6(1) నిబంధనల ప్రకారం ప్రజలకు పారదర్శకంగా సమాచారం అందించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ పాలనలో పారదర్శకతకు ఆర్టిఐ చట్టం తోడ్పడుతుందని, జిల్లాలో పెండింగ్లో ఉన్న 170 కేసులను ప్రత్యేక హియరింగ్ ద్వారా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కమిషనర్లు దేశాల భూపాల్, పీవీ శ్రీనివాస్ రావు, అయోధ్య రెడ్డి, మెహసీనా పర్వీన్ మాట్లాడుతూ అధికారులు ప్రజల్లోకి ఆర్టిఐ చట్టం తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు, ఫస్ట్ అప్పిలేట్ అధికారులు పాల్గొన్నారు.