04-10-2025 12:24:28 AM
-ఒకేరోజు మూడు సెంచరీల మోత
-రాహుల్, జురేల్, జడేజాల శతకాల హోరు
-భారీ ఆధిక్యంలో మన జట్టు
అహ్మదాబాద్, అక్టోబర్ ౩: అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా సత్తా చాటింది. ఒకేరోజు మన బ్యాట్స్‌మెన్‌లు పరుగుల వర్షం కురిపించారు. ముగ్గురు భారత్ ఆటగాళ్లు ముగ్గురు సెంచరీల మోత మోగించారు. దీంతో మన జట్టు 286 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీలతో విజృంభించారు.
ఈ ముగ్గురూ ఒకే రోజు శతకాలు నమోదు చేయడం విశేషం. 121/2 ఓవ్నట్ స్కోర్‌తో టీమ్‌ఇండియా రెండో రోజును ప్రారంభించి, ఆట ముగిసే సమయానికి 128 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు కేఎల్ రాహుల్ (100; 190 బంతుల్లో, 12 ఫోర్లు), ధ్రువ్ జురేల్ (125; 210 బంతుల్లో, 15 ఫోర్లు, 3 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (104; 176 బంతుల్లో, 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుతంగా రాణించారు. ఇంగ్లాండ్ సిరీస్‌లో గాయం వల్ల రిషభ్ పంత్ జట్టుకు దూరమైన వేళ తనకు అందివచ్చిన అవకాశాన్ని ధ్రువ్ జురేల్ అద్భుతంగా ఒడిసి పట్టుకున్నాడు.
అయిదో వికెట్‌కు జడేజాతో కలిసి 206 పరుగుల (331 బంతుల్లో) భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వెస్టిండీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. రెండో రోజు ఆట ముగియడానికి కాసేపటి ముందు ఖేరీ పియెరీ బౌలింగ్లో వికెట్ కీపర్ షైహోప్నకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ (9; 13 బంతులు) ఉన్నారు. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ 2, జైడెన్ సీల్స్, జొమెల్ వారికన్, ఖేరీ పియెరీ తలో వికెట్ సాధించారు.