calender_icon.png 6 September, 2025 | 8:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజంలో టీచర్ల పాత్ర కీలకం

06-09-2025 12:00:00 AM

చేవెళ్ల ఏసీపీ కిషన్, మాజీ జడ్పీటీసీ మాలతీ కృష్ణా రెడ్డి 

చేవెళ్ల , సెప్టెంబర్ 5 : సమాజ నిర్మాణంలో టీచర్ల పాత్ర ఎంతో కీలకమైనదని చేవెళ్ల ఏసీపీ కిషన్, మాజీ జడ్పీటీసీ మాలతి కృష్ణారెడ్డి చెప్పారు. శుక్రవారం టీచర్స్ డే సందర్భంగా చేవెళ్లలోని కస్తూర్భా గాంధీ పాఠశాల విద్యార్థినులకు నోట్ బుక్స్, బిస్కెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత ముఖ్యమైన స్థానం ఉపాధ్యాయులదేనని, వారు మనకు చదువుతో పాటు మంచి విలువలు కూడా నేర్పిస్తారన్నారు.

వారు లేకపోతే జ్ఞానం అనే వెలుగు మన జీవితాల్లో చేరేది కాదని, వారు చూపే మార్గమే మన భవిష్యత్ కు పునాది అవుతుందని చెప్పారు. దేశ ప్రగతిలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైందని సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పారని, గొప్ప రచనలు, మాటలతో ఆయన దేశంలోని ప్రజలను ప్రభావితం చేశారన్నారు. మార్చలేని గతం గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించమని ఆయన పిలుపునిచ్చారని గుర్తు చేశారు.

ఉపాధ్యాయులు ఈ సమాజంలో మంచి చెడును గురించి తెలియజేసి మనకో భవిష్యత్ చూపిస్తారని అందుకే సమాజంలో వారి పట్ల ప్రత్యేకమైన గౌరవం, అభిమానం ఉంటాయన్నారు. తమకు ఓనమాలు నేర్పించిన గురువులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

మంచినీటి సమస్య, ప్లే గ్రౌండ్ లేదని చెప్పాగా.. త్వరలోనే మంచినీటి సమస్యను పరిష్కరించి, ప్లే గ్రౌండ్ను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాను హామీ ఇచ్చారు. అలాగే చిల్డ్న్స్ పార్కును కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జూకన్నగారి లక్ష్మా రెడ్డి , చేవెళ్ల పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ నత్తి కృష్ణా రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.