calender_icon.png 21 October, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెలకట్టలేనివి పోలీస్ అమరుల త్యాగాలు

21-10-2025 08:15:47 PM

బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్...

మందమర్రి (విజయక్రాంతి): పోలీస్ అమరవీరులు సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం, శాంతిభద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగాలు మరువలేనివని బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్ అన్నారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని(ఫ్లాగ్ డే) పురస్కరించుకొని పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో గల అమర వీరుల స్తూపం వద్ద బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీస్ పరిధిలోని పోలీసులు మంగళవారం పోలీసుల అమర వీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా బెల్లంపల్లి ఏసీపి ఏ రవి కుమార్, బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి అమర వీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, శ్రద్ధాంజలి ఘటించారు, అనంతరం సాయిధ పోలీసులు శోక్ శ్రస్త్ నిర్వహించి, మరణించిన పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ, దేశ రక్షణలో ప్రాణం కంటే విధి నిర్వహణ గొప్పదని చాటిన అమరుల త్యాగాలు చిర స్మరణీయమని, వారి త్యాగాలను వెలకట్టలేమని, ప్రతీ ఒక్కరూ పోలీస్ అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగ ఫలం వల్ల గతం కంటే ప్రస్తుత పరిస్థితి మెరుగ్గా ఉందని, వారి త్యాగనిరతిని నిరంతరం మననం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమర వీరులు అందించిన స్ఫూర్తి తోనే ప్రజల భద్రత, రక్షణ చర్యల్లో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణకు ముందుకు సాగుతున్నామన్నారు. అక్టోబర్ 21 జాతీయ పోలీస్ చరిత్రలో ఎర్రని అక్షరాలతో లిఖించబడిన రోజని, 62 సంవత్సరాల క్రితం భారత సరిహద్దుల్లో పహారా కాస్తున్న పోలీసు దళాలపై చైనీయులు దాడి చేశారని, భారత్ - చైనా సరిహద్దుల్లో దేశ భద్రత కోసం ప్రాణాలను అర్పించిన వీర పోలీసుల త్యాగాలను స్మరిస్తూ ప్రతి ఏటా అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీస్ ఫ్లాగ్ డే దినోత్సవంగా జరుపుకుంటున్నామని వివరించారు.ప్రజల క్షేమం, సంరక్షణార్థం పోలీసు వ్యవస్థ ఎల్లవేళలా ముందుంటుందని స్పష్టం చేశారు.

ఎదైనా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే దానిలో శాంతిభద్రతలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని,శాంతిభద్రత పర్యవేక్షణకు, ప్రజల మాన,ప్రాణ,ఆస్తుల సంరక్షణకు పోలీసులు నిరంతరం కృషి చేస్తారని తెలిపారు. సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ కుటుంబ సభ్యుల గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. తీవ్రవాదం ఎక్కువగా ఉన్న సమయంలో అమరులు చేసిన ప్రాణ త్యాగం ఫలితంగా నేడు మనం స్వేచ్ఛగా ఉన్నామని, వారి పోరాట పటిమను కొనసాగించాల్సిన అవసరం  ఉందన్నారు. విధి నిర్వహణలో ఎన్నో జటిలమైన సవాలు ఎదురవుతున్న వాటిని అధిగమిస్తూ, ముందుకు సాగుతున్నామని తెలిపారు. అమరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అన్ని వర్గాల ప్రజలపై ఉందని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో మందమర్రి సీఐ కే శశిధర్ రెడ్డి, బెల్లంపల్లి రూరల్ సిఐ హనుక్, బెల్లంపల్లి టౌన్ సిఐ శ్రీనివాస్ రావు, తాండూరు సిఐ దేవయ్య, పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, సర్కిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.