19-07-2025 11:15:10 PM
సిపిఎం సీనియర్ నాయకులు రాచమళ్ళ రామస్వామి మృతి..
సిద్ధాంత పరుడు ఎర్రజెండా ముద్దుబిడ్డ..
అమరునికి అశ్రునివాళి అందించిన ప్రజలు..
ఈ ప్రాంత ఎర్రజెండా ఉద్యమానికి పెద్ద దిక్కు కోల్పోయింది..
మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి..
హుజూర్ నగర్/గరిడేపల్లి: అమరుల త్యాగాలు వృధా కావని, నిజాయితీతో మంచి ఆశయంతో ప్రజాసేవ చేసిన నాయకులను ఈ చరిత్ర ఎన్నడూ మరవదని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి(Former MLA Julakanti Ranga Reddy) అన్నారు. గరిడేపల్లి మండలంలోని రాయినిగూడెం గ్రామంలో సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ రాచమళ్ళ రామస్వామి శనివారం మృతి చెందారు.రామస్వామి మృతి పట్ల సంతాపం ప్రకటించి ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమానికి రాచమళ్ళ రామస్వామి ఎనలేని సేవ అందించారని, పార్టీ ఈ ప్రాంతంలో ఒక పెద్ద దిక్కును కోల్పోయిందని ఆయన తెలిపారు.
రామస్వామి ప్రజా సమస్యల పట్ల వెంటనే స్పందించే నాయకుడని, కేవలం పెత్తనం చేయడం కోసం కాకుండా ప్రజలకు, సమాజానికి అంకిత భావంతో పనిచేయడం ఆయన ప్రధాన లక్షణమని పేర్కొన్నారు. చివరి వరకు ఎర్రజెండాను నమ్ముకుని ప్రజలకు సేవలు అందించడమే కాక ఎర్రజెండా అభివృద్ధికి సహకారాన్ని అందించారని తెలిపారు. రాయినిగూడెం గ్రామ సర్పంచ్ గా రెండుసార్లు పనిచేశారని, 1981 నుండి 1988 వరకు, 1995 నుంచి 2000 వరకు రామస్వామి రాయినిగూడెం ఉమ్మడి గ్రామపంచాయతీకి సర్పంచిగా సేవలందించారని తెలిపారు. అంతేకాక సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులుగా, గొర్లు, మేకల పెంపకం దార్ల సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ సభ్యులుగా ఆయన పనిచేశారని తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామస్వామి ఇంత త్వరగా ప్రజలందరికీ దూరమవుతారని తాను ఊహించలేదన్నారు.
ప్రజలందరికీ న్యాయం చేసేది ఎర్రజెండా అని బలంగా నమ్మే వ్యక్తుల్లో ఆయన ఒకరని అభిప్రాయపడ్డారు. ప్రకృతి సంపదంత అందరికీ అందాలనే ఎర్ర జెండా సిద్ధాంతాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లాడని తెలిపారు. పేద ప్రజలందరికీ కడుపునిండా తిండి, ఒంటినిండా బట్ట, ఉండటానికి ఇల్లు, బ్రతికేందుకు స్వేచ్ఛ, ఉపాధి, చదువు అందించే లక్ష్యం ఉన్న ఒకే ఒక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని ఆ ఎజెండాతోనే ఈ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమానికి రామస్వామి సేవలందించారని తెలిపారు. ప్రకృతి ఇచ్చిన సంపద కొద్దిమంది మాత్రమే అనుభవించి మెజారిటీ ప్రజలు ఇబ్బందులు పడవద్దనే లక్ష్యంతో ఎర్రజెండా ఉద్యమం నేటికీ ముందుకు వెళుతుందని ఆయన అన్నారు.
ప్రపంచంలో అధికారంలో ఉన్న ప్రాంతంలో ఎర్రజెండా వీటన్నిటిని అక్కడ అమలు చేస్తుందని ఆయన తెలిపారు. నిజాయితీ, మంచి ఆశయం కోసం పనిచేసే అతి కొద్ది మంది నాయకుల్లో రాచమళ్ళ రామస్వామి ఒకరని ఆయన కొనియాడారు. ఎంతోకాలంగా ఎర్రజెండా కోసం పనిచేస్తున్న రామస్వామి ఎన్నో నిర్బంధాలను, దాడులను ఎదుర్కొని భయపడకుండా ఎర్రజెండా కోసం పనిచేస్తూ ప్రజల కోసం అంకిత భావంతో సేవలు అందించారని తెలిపారు. ఎంతో విశ్వాసంతో ఎర్రజెండాను నమ్ముకుని ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎనలేని సేవ అందించి ఎర్రజెండా చరిత్ర పుటలలో తనకంటూ ఒక పేజీని ఏర్పాటు చేసుకున్న రామస్వామి మృతి ఈ ప్రాంత ఉద్యమానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. రామస్వామి ఆశయాలను సాధించిన రోజే ఆయనకు ఘనమైన నివాళి అందించినట్లు అవుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన సాధన కోసం ప్రతి ఒక్క కమ్యూనిస్టు అంకిత భావంతో పనిచేయాలని ఆయన కోరారు. అనంతరం రాజకీయాలకతీతంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజల మధ్య రామస్వామి అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కోశెట్టి యాదగిరిరావు, సిపిఎం పార్టీ జిల్లా కార్య దర్శి వర్గ సభ్యులు నాగర పాండు, ములకలపల్లి రాములు,జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి, ఎస్.కె యాకూబ్, అనంత ప్రకాష్ ఒట్టేప్పు సైదులు దుగ్గి బ్రహ్మం, పోసపోయిన హుస్సేన్, బాలు నాయక్, సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎల్లావుల రాములు నేరేడుచర్ల మాజీ ఎంపీపీ సైదులు గరిడేపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంజన్ రెడ్డి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల సైదయ్య సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు యానాల సోమయ్య,దోసపాటి బిక్షం, దోసపాటి సుధాకర్,బోయిళ్ళ అర్జున్, బొల్లిపల్లి శ్రీనివాస్,యానాల సుశీల,జుట్టు కొండ కళమ్మ,యమగాని వెంకటేశ్వర్లు రావిరాల శీను,మీసాల మట్టయ్య,పటాన్ మైబెల్లి శ్రీను,శీలం శ్రీను,మండవ సైదులు, పాశం వెంకటనారాయణ మాజీ సర్పంచ్ దేవదానం మాజీ ఎంపీటీసీ సందీప్, వివిధ పార్టీల నాయకులు,కార్యకర్తలు,సిపిఎం పార్టీ మండల నాయకులు, ప్రజలు, కుటుంబ సభ్యులు,తదితరులు, పాల్గొన్నారు.