08-12-2024 12:55:31 AM
విజయక్రాంతి ఖేల్ విభాగం: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే తడ ‘బ్యాటు’కు గురైంది. తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ పరుగులకే ఆలౌట్ అయిన రోహిత్ సేన ఆసీస్‌ను కూడా తక్కువకే కట్టడి చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ (140) సెంచరీతో చెలరేగాడు. అతడు వన్డే తరహాలో ఆడుతూ.. వేగంగా పరుగులు రాబట్టాడు. ఇక తొలి టెస్టులో విఫలమైన లబుషేన్ (64) అర్ధ సెంచరీతో మెరిశాడు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ చెరి 4, అశ్విన్, నితీశ్ రెడ్డి చెరో వికెట్ తీసుకున్నారు.
అదే కంగారు
ఎట్టకేలకు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆలౌట్ కాగా.. బ్యాటింగ్ ఆరంభించిన రోహిత్ సేన ఇక్కడ కూడా మరోమారు తడబడింది. ఫలితంగా 105 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది. తన ఓపెనింగ్ స్థానం రాహుల్ కోసం త్యాగం చేసి మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలం అయ్యాడు.
తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా మరోమారు విఫలం అయ్యాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే భారత్ ఇంకా 29 పరుగులు చేయాలి. రెండో ఇన్నింగ్స్‌లో కమిన్స్, బోలాండ్ చెరి 2, స్టార్క్ ఒక వికెట్ తీసుకున్నాడు.
గెలుపు అసాధ్యమే.. డ్రా కూడా!
పింక్ బాల్ టెస్టులో టీమిండియా గెలవడం అసాధ్యంగానే కనిపిస్తోంది. ఈ టెస్టులో రెండు రోజుల ఆట మాత్రమే ముగిసింది. రెండో రోజు ముగిసేసరికి రోహిత్ సేన సగం వికెట్లు కోల్పోయి 128 పరుగులు మాత్రమే చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే ఇంకా 29 పరుగులు చేయాల్సి ఉంది. ఇటువంటి తరుణంలో భారత్ గెలవడం అనేది అసాధ్యం అని క్రీడాపండితులు విశ్లేషిస్తున్నారు.
ఆరంభం దక్కినా..
బోర్డర్ ట్రోఫీలో టీమిండియాకు శుభారంభం దక్కింది. తొలి టెస్టులోనే గెలిచిన భారత్ ఇక్కడ కూడా గెలిచి సిరీస్ గెలుపును మరింత ఖాయం చేసుకుంటుందని అంతా భావించారు. కానీ అలా మాత్రం జరగలేదు. ఈ టెస్టులో టాస్ గెలిచినా కానీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. మొదట బ్యాటింగ్ చేసి తక్కువ స్కోరుకే వెనుదిరిగి పట్టుకోల్పోయారు. ఆ తర్వాత ఆసీస్ బ్యాటింగ్‌కు వచ్చినపుడు వారినైనా తక్కువ స్కోరుకు కట్టడి చేస్తారని అంతా ఆశించినా అలా జరగలేదు.
మన బ్యాటర్లు 200 చేయడానికే అపసోపాలు పడ్డ పిచ్ మీద ఆసీస్ బ్యాటర్లు 300+ స్కోరు సాధించి తమ జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. రెండో ఇన్నింగ్స్‌లోనైనా పెద్ద భాగస్వామ్యాలు నిర్మించి ఆసీస్ ఆధిపత్యానికి చెక్ పెడతారని భావించినా కానీ అలా జరగలేదు.