11-05-2025 01:30:24 AM
- ఏఐఎన్యూలో ఘనంగా మాతృ దినోత్సవం
- కిడ్నీలు దానం చేసిన తల్లులకు సత్కారం
హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): తమ కిడ్నీలను తమ పిల్లలకు దానం చేసిన కొంతమంది తల్లులను ఏషియన్ ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ)లో మాతృదినోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేకంగా సత్కరించారు.
అమ్మ ఇచ్చిన రెండో జీవితం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒకసారి కాకుండా, రెం డోసారి పిల్లలకు జన్మనిచ్చిన తల్లులను గౌరవించారు. మాతృదినోత్సవాన్ని ఏఐఎన్యూ పవిత్రంగా చేసింది. తమ పిల్లల జీవితాలు కాపాడేందుకు తమకిడ్నీలు దానం చేసిన తల్లుల గాధలను ఆస్పత్రి ద్వారా అందరికీ పంచింది.
కిడ్నీ మార్పిడి తర్వాత పూర్తిగా కోలుకున్న గ్రహీతలు కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. వాళ్లంతా తమ జీవితాల ను తల్లులు ఎలా సమూలంగా మార్చేశారో, అంతకుముందు తాము అనారోగ్యంతో ఎంత ఇబ్బంది పడ్డామో తడిగుండెలతో వివరించారు. ఏఐఎన్యూ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సి.మల్లికార్జున మాట్లాడుతూ.. ఈ తల్లులు కేవలం పిల్లలను కని, పెంచడమే కాదు.. వాళ్లకు రెండోసారి జీవితం ఇచ్చారని కొనియాడారు.
ఈ అద్భుతమైన త్యాగమూర్తులను సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ సన్మానం ఎప్పటికీ స్ఫూర్తినిచ్చే ఈ తల్లుల అపూర్వ త్యాగానికి చిన్న నూలుపోగు లాంటిదే అన్నారు.
సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ పి.ఎస్. వలీ మాట్లాడుతూ.. తమ పిల్లలకు నిస్వార్థంగా తమ సొంత కిడ్నీలు దానం చేసి, వారి ప్రాణాలు రెండోసారి నిలబెట్టిన తల్లులను ఈ మాతృదినోత్సవాన మనం గౌరవించుకుంటున్నామన్నారు. ఈ సంబురాల్లో ఏఐఎన్యూ వైద్య నిపుణులు సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ (బంజారాహిల్స్) డాక్టర్ శ్రీకాంత్ గుండ్లపల్లి, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ (బంజారాహిల్స్) డాక్టర్ సుజీత్‌రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ (హైటెక్‌సిటీ) డాక్టర్ క్రాంతికుమార్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ (దిల్‌సుఖ్‌నగర్) డాక్టర్ అనూష గుడిపాటి పాల్గొన్నారు.