calender_icon.png 15 October, 2025 | 12:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీరాంసాగర్ రెండో దశకు భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలి

15-10-2025 01:38:10 AM

  1. మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేరు దేనికి పెట్టినా అభ్యంతరం లేదు..

సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి 

సూర్యాపేట, అక్టోబర్ 14 (విజయక్రాంతి) : శ్రీరామ్ సాగర్ రెండవ దశ కు మాజీ పార్లమెంటు సభ్యులు కమ్యూనిస్టు నేత భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలని, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరును ఇతర దేనికి పెట్టిన మాకు ఎలాంటి అభ్యంతరం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన జిల్లా ప్రజా సంఘాల బాధ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

శ్రీరామ్ సాగర్ రెండో దశ నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక ప్రజా పోరాటాలు జరిగాయని, ఆ పోరాటంలో మిర్యాలగూడ మాజీ పార్లమెంటు సభ్యుడిగా కమ్యూనిస్టు నాయకుడుగా ఉన్న భీమ్ రెడ్డి నరసింహారెడ్డి ప్రాజెక్టు సాధన కోసం విశేష కృషి చేశారని అన్నారు. 

అధికారం ఉన్నదని నెపంతో కమ్యూనిస్టుల పోరాటాన్ని భీమ్ రెడ్డి నరసింహారెడ్డి త్యాగాన్ని విస్మరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి ఆలోచన  గుర్తించకుండా ఈ ప్రాంత ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండ ఏకపక్షంగా శ్రీరామ్ సాగర్  రెండవ దశకు మాజీ మంత్రివర్యులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టడం సమంజసం కాదన్నారు. తాను చనిపోయేంతవరకు గోదావరి జలాలు తాగుతానని పదే పదే బిఎన్  చెప్పేవాడన్నారు.

కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా ఈ ప్రాంతం సస్యశ్యామలమై రైతులు సంతోషంతో వ్యవసాయాన్ని చేసుకుంటున్నార న్నారు. ఇప్పటికైనా ఎస్సారెస్పీ రెండో దశకు భీమ్ రెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ర్ట కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న, ధనియాకుల శ్రీకాంత్, జె.నరసింహారావు, మద్దెల జ్యోతి, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.