24-05-2025 12:54:45 AM
కామారెడ్డి టౌన్, మే 23(విజయ క్రాంతి): ఈనెల 25న జరగనున్న గ్రామ పాలన అధికారుల ఎంపిక పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామ పాలన అధికారుల ఎంపిక పరీక్ష నిర్వహణకు సంబంధించి ఇన్విజిలేటర్స్ కు, పలువురు అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 25న ఆదివారం రోజున కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం పరీక్ష ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 01:30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ పరీక్షకు జిల్లాలో 402 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నట్లు, గతంలో వీఆర్వో, వీఆర్‌ఏలుగా పనిచేసిన వారు ఈ పరీక్షకు హాజరవుతున్నట్టు తెలిపారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు, ఫోటోతో కలిగిన గుర్తింపు కార్డు వెంట తీసుకురావాలని ఆయన తెలిపారు. ఈ పరీక్ష నిర్వహణకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. పరీక్ష కేంద్రంలో సానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.
పరీక్ష జరుగు సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని విద్యుత్ అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రంలో ఎ ఎన్‌ఎంలు అవసరమైన మందులతో సహా డిప్యూట్ చేయాలని తెలిపారు. పరీక్ష హాల్లోకి వెళ్లే సమయంలో అభ్యర్థులను నిషిత పరిశీలన చేయడం జరుగుతుందని, అభ్యర్థులు ఎలక్ట్రానిక్ పరికరాలు, గ్యాడ్జెట్స్ అనుమతించబోమని తెలిపారు. ఆదివారం ఉదయం 9:30 గంటలకు అభ్యర్థులను పరీక్ష హాల్లోకి అనుమతించడం జరుగుతుందని 10:00 గంటలకు మెయిన్ గేట్ మూసి వేయడం జరుగుతుందని తెలిపారు.
ఉదయం 10:25 గంటలకు ప్రశ్నపత్రాలు అభ్యర్థులకు పంపిణీ చేయడం జరుగుతుందని, 10:30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుంది అని తెలిపారు. మధ్యాహ్నం 01:25 నిమిషములకు హెచ్చరిక గంట మోగించబడుతుందని, మధ్యాహ్నం 01:30 గంటలకు పరీక్ష నిర్వహణ పూర్తయి జవాబు పత్రాలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు సమయపాలన పాటించాలని కలెక్టర్ కోరారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వి. విక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులు సమయానుకూలంగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. మాస్ కాపీయింగ్ కు పాల్పడకూడదని తెలిపారు. ఇన్విజిలేటర్లు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఆర్డిఓ వీణ, చీఫ్ సూపరింటెండెంట్ విశ్వ ప్రసాద్, పరిశీలకులు శంకర్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, తదితరులు పాల్గొన్నారు.