calender_icon.png 19 November, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టేషన్ నుంచి పారిపోయిన ఎస్సై

19-11-2025 12:05:45 AM

-లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్సై రాజేశ్

-వారి నుంచి తప్పించుకునేందుకు పొలాల వెంట కి.మీ. వరకు ఎస్సై పరుగు

-ఏసీబీ సిబ్బంది ఒకరు వాటర్ ట్యాంక్ ఎక్కి చూస్తూ.. మిగతా అధికారులకు సూచనలు

-సినీ ఫక్కీలో ఛేజింగ్ చేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు

-స్టేషన్ ఎదుట స్థానికుల సంబురాలు

మెదక్, నవంబర్ 18(విజయక్రాంతి): లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఓ ఎస్సై.. వారి నుంచి తప్పించుకునేందుకు పో లీస్ స్టేషన్ భవనం పైనుంచి దూకి పొలాల వెంట పరుగు తీశాడు. అతడిని పట్టుకునేందుకు ఏసీబీ అధికారుల్లో ఒకరు వాటర్ ట్యాంక్ ఎక్కి, ఎస్సైను గమనిస్తూ సూచనలు ఇస్తుండగా.. మిగతా సిబ్బంది ఎస్సైను వెంబడించి పట్టుకున్నారు.

ఈ ఘటన మెదక్ జిల్లా టేక్మాల్‌లో మంగళవారం జరిగింది. టేక్మాల్ మండల పరిధిలోని అసద్ మహ్మద్‌పల్లి తండాకు చెందిన రైతు పాండు అద్దెకు హార్వెస్టర్ తెచ్చాడు. ఆ వాహన బ్యాటరీ చోరీ జరగడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు పరిష్కరించడానికి పాండు నుంచి ఎస్సై రాజేశ్ రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఒప్పందం ప్రకా రం మొదటి దఫాగా రూ.10వేలు యూపీఐ ద్వారా, మరో రూ.10 వేలు నగదు ఇచ్చాడు. అయినా కేసు ముందుకు కదలకపోవడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.

వారి సూచన మేరకు మిగతా రూ.30 వేలు మంగళవారం ఎస్సై రాజేశ్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే వారి నుంచి తప్పించుకునేందుకు ఎస్సై రాజేశ్ పోలీస్ స్టేషన్ భవనంపైకి వెళ్లి అక్కడి నుంచి కిందికి దూకాడు. ఎస్సైని వెంబడించిన ఏసీబీ అధికారులు సైతం భవనం పైనుంచి దూకి వెంబడించారు. ఎస్సై రాజేశ్ పొలాల వెంబడి సుమారు కిలోమీటరుకు పైగా పరిగెత్తగా ఏసీబీ సిబ్బంది వదలకుండా వెంబడించారు.

ఏసీబీ సిబ్బంది ఒకరు వాటర్ ట్యాంక్ ఎక్కి మిగతా అధికారులకు సూచన చేస్తుండగా సినీ ఫక్కీలో ఛేజింగ్ చేసి ఎస్సైని పట్టుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ ఎస్సైలు రమేశ్, వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. కాగా టేక్మాల్ ఎస్సై రాజేష్ ఏసీబీకి చిక్కిన విషయం తెలుసుకున్న టేక్మాల్ పట్టణ ప్రజలు స్టేషన్ ఎదుట టపాసులు పేల్చి, సంబురాలు జరుపుకున్నారు.  

రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారులు

హైదరాబాద్ సిటీ బ్యూరో(విజయక్రాంతి):సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యా లయంలో రూ.లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఆస్తికి సంబంధించి తహసీల్దార్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఆ నోటీసులపై తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండాలంటే రూ.4 లక్షల లంచం ఇవ్వాలని  సర్వేయర్ కలువ కిరణ్‌కుమార్ డిమాండ్ చేశాడు. దీంతో బా ధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూ చన మేరకు మంగళవారం తొలి విడతగా రూ.లక్ష ఇచ్చేందుకు అంగీకరించాడు. సర్వేయర్ కిరణ్‌కుమార్ సూచన మేరకు ఆ డ బ్బును చైన్‌మ్యాన్ మేకల భాస్కర్ ఏవో ఇస్తుండగా ఏసీబీ సిటీ రేంజ్-2 యూని ట్ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ

గోపాలపేట: వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఏఈగా పనిచేస్తున్న వ్య క్తి మంగళవారం ఏసీబీకి పట్టుబడ్డా డు. వనపర్తి జిల్లాకే చెందిన హర్షవర్ధన్‌రెడ్డి విద్యుత్ ఏఈగా మొదటి పోస్టింగ్ పొంది, గోపాలపేటలోనే వి ధులు నిర్వహిస్తున్నాడు. ఏదుల మం డలంలో ఓ రైతు ట్రాన్స్‌ఫార్మర్ అవసరం ఉండి విద్యుత్ అధికారులకు ద రఖాస్తు చేసుకున్నారు.

రూ.40 వేల లంచం ఇస్తేనే ట్రాన్స్‌ఫార్మర్ మంజూ రు చేస్తానని ఏఈ హర్షవర్ధన్‌రెడ్డి డి మాండ్ చేశాడు. బాధితుడు మొదటి విడతగా రూ.20 వేలు ముట్టచెప్పా డు. రెండో విడత గడువు అడిగి ఏసీ బీ అధికారులను ఆశ్రయించాడు. వా రి సూచనతో మంగళవారం రూ.20 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏఈ హర్షవర్ధన్‌రెడ్డిపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.