22-09-2025 12:00:00 AM
నిజమైన కవి తన మనోఫలకంపై నిశ్శబ్దంగా మెదిలే ఆలోచనలకు, అనుభూతులకు అక్షర రూపం ఇస్తాడు. భావరూపాలకు ప్రాణం పోస్తాడు. జీవన వేదాన్ని విడమరచి విశదీకరిస్తాడు. అనుభవసారం నుంచి వచ్చిన జ్ఞానాన్ని పంచుతాడు. వాస్తవిక ప్రపంచాన్ని మనకు సులభమైన శైలి, శిల్పం ద్వారా అర్థం చేయిస్తాడు. సరికొత్త అనుభూతులకు గురిచేస్తాడు. ఆ కోవకు చెందిన కవి సుంకరి కృష్ణప్రసాద్.
తన తాజా కవితల సంకలనం ‘నా జీవన వేదం’ ద్వారా మనల్ని సరికొత్త భావ సంద్రంలోకి తీసుకెళ్తాడు. ‘వాన చినుకులు’ అన్న కవితతో సంకలనం ప్రారంభమవుతుంది. ‘ఈ చినుకులు చిన్న చిన్న సంతోషాలు/ ముద్దు ముద్దు మురిపాలు/ నా ఉనికికి ప్రతిరూపాలు’ అంటూ వాన వెల్లువపై తనకున్న ప్రేమను కవి చాటిచెప్తాడు. ‘నాన్న ఒక దుఃఖ నది’ కవితలో నాన్న గురించి కవి రాస్తూ.. ‘తనని ఎప్పుడు చూసినా/తనలో ఒక దుఃఖ నది ప్రవహిస్తుండేది’ అని రాసుకొస్తాడు.
రెండు వాక్యాల్లో తండ్రితనపు త్యాగాలను స్ఫురణకు తెస్తాడు. ‘అప్పుడు వర్సెస్ ఇప్పుడు’ కవితలో తన గతానికి, వర్తమానానికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు. ‘ఒకప్పుడు నిప్పంటించిన రాకెట్‌లా / ఆకాశంలోకి దూసుకెళ్లేవాడిని..’, ‘ నేలను నింగినీ ఒక్కటి చేస్తూ/ నవ్వుల హరివిల్లయ్యేవాడిని’ అంటూ కవిత్వీకరించాడు. ప్రస్తుత తన అంతరంగాన్ని, తన సంఘర్షణను ‘ఇప్పుడేంటి ఇలా గదిలో బంధించబడిన నక్షత్రాన్నయ్యాను..
చీకటంతా నా చుట్టూ చేరుతోంది’ అంటూ వలపోస్తాడు. అంతేనా.. గతం, వర్తమానం ఎలా ఉన్నా.. ‘ఎవరికి తెలుసు? ఈ జీవిత రహస్యం. అందరికీ నేను చేరువ అవుతున్నానేమో’ అనే ఆశాభావాన్నీ వ్యక్తపరుస్తాడు. అలా ఒంటరితనానికి ఆశాజనకమైన అర్థం చెప్పడం కవిలోని అంతఃదృష్టిని ఆవిష్కరిస్తుంది. ‘నా నేస్తం కుక్క’ కవితలో కవి ‘నన్ను మనిషిగా గుర్తించింది కుక్క’ అని తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు.
మొదట తను బెదిరించినా, తర్వాత వెనక్కి తగ్గిందంటూ, తనను మనిషిగా గుర్తుపట్టిదంటూ ఆనందపడతాడు. ఇకనైనా ‘నేను మనుషులను గుర్తుపట్టడం నేర్చుకోవాల’ంటాడు. ‘నా భయాన్ని నేనే చూస్తాను.. అది నన్ను గెలుస్తూనే ఉంటుంది’ అనే వ్యక్తీకరణ.. భయాన్ని కేవలం ఒక ప్రతికూల భావంగా కాకుండా, ఒక ప్రేరణగా, ఒక సవాల్‌గా చూసిన కవి దృష్టి మనకు ద్యోతకమవుతుంది.
ఆ భయమే తనను నిత్యం నడిపిస్తుందని చెప్పడం కవిలోని ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ‘నా దగ్గర ప్రేమ ఉంది.. మిమ్మల్ని ప్రేమించే మనసుంది’ అని ప్రేమకు సరికొత్త నిర్వచనం ఇచ్చాడు కవి. ప్రేమంటే కేవలం ఒక వ్యక్తిని ప్రేమించడం కాదని, ప్రపంచాన్ని, మనుషులను ప్రేమించడమే నిజమైన ప్రేమ అనేది కవి భావన. ‘కొందరు నన్ను నా బాధతోటి తదేకంగా చూస్తారు’ అంటూ కవి వ్యక్తీకరణ మన మనసులను కదిలిస్తుంది.
‘మన బాధలను చూసి ఆనందించేవారు ఉంటారు. ఆ బాధల్లోనే ఆనందాన్ని వెతుక్కునేవారూ సమాజంలో ఉన్నార’ంటూ కవి నిగూఢంగా చెప్తాడు. అదే సమయంలో ‘కొందరు నన్ను కళ్లలో పెట్టుకుని చూస్తున్నారు’ అని చెప్తూ కొందరి ఆత్మీయతనూ గుర్తుచేసుకుంటాడు కవి. జీవన సమరంలో మనం దేనికోసమే దేవులాడుతుంటామని ‘చిన్న చిన్న కలలు’ కవితలో మన గతం తాలూకు చిన్న కోరికలను గుర్తుచేస్తాడు.
‘మూడు పూటలా కాస్తంత తిండి దొరికితే చాల’ంటాడు. ‘చందమామను తనివితీరా చూస్తేచాలు/ పక్షి వెంట రివ్వున ఎగిరితే చాల’ంటాడు. వాస్తవానికి అవేం పెద్ద కోరికలు కావు. చిన్న చిన్న కలలే. కానీ, రూపాయల వేటలో పడి, జీవన సమర సుడిగుండంలో మనిషి అవన్నీ కోల్పోతున్నాడనే ఆవేదన వ్యక్తం చేశాడు కవి. మొత్తానికి కవి సుంకరి కృష్ణప్రసాద్ కవిత్వం జీవితానుభవం, వాస్తవిక దృక్పథం, సానుకూల ఆలోచనలతో పాఠకులను ఆకట్టుకుంటుంది. కవిత్వాన్ని ఆస్వాదించి, తిరిగి పలవరించాలని కోరుకునే ప్రతిఒక్కరూ చదవాల్సిన పుస్తకమిది.
రతన్ రుద్ర