14-11-2025 12:38:14 AM
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి) : ఎమ్మెల్యేల ఫిరాయింపులపై విచారణ నేపథ్యంలో సందర్శకులు, మీడి యా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు అసెంబ్లీలోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ స్పీకర్ కార్యాలయం నుంచి విడుదలైన బులెటిన్ రాజ్యాంగ విరుద్ధమని, దీనిని వెంటనే ఎత్తివేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్నది నిజాం రాజ్యమా, నియంత రాజ్యమా అని ప్రశ్నించారు.
గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లెజిస్లేటివ్ ట్రిబ్యునల్‌లో స్పీకర్ సమక్షంలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై విచారణ నేపథ్యంలో కేసులో వాదిస్తున్న అడ్వకేట్లను సెల్ ఫోన్‌లు కూడా తీసుకు రావద్దని బులిటిన్ హుకుం జారీ చేయడమేంటని మండిపడ్డారు. సుప్రీం కోర్టు ఫుల్ బెంచ్ వాదనలు జరిగినపుడు కూడా సెల్ ఫోన్లు అనుమతిస్తారని స్పష్టం చేశారు.
ఇది స్పీకర్ , సీఎం రేవంత్ రెడ్డి సొంత వ్యవహారం కాదని, ప్రభుత్వం తీరు దొంగలు దొంగలు ఊర్లు పంచు కున్నట్టు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విచారణను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రజలు ప్రత్యక్ష్యంగా వీక్షించే అవకాశమివ్వాలని డిమాండ్ చేశారు. తమ ఫిరాయింపు ఎమ్మెల్యేల వాదనల గురించి నియోజకవర్గ ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నేతలు సతీష్ రెడ్డి, హరిరమా దేవి, కల్వకుర్తి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.