03-08-2025 12:00:00 AM
20 ఏళ్ల తర్వాత వరుస వైభవం
తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర హీరోల నుంచి ఒకప్పుడు ఏడాదికి ఐదు నుంచి పది సినిమాలు వచ్చేవి. కొందరు స్టార్ హీరోలైతే ఏడాదిలో సగటున నెలకో సినిమా విడుదల చేసిన సందర్భాలూ ఉన్నాయి. చిరంజీవి, కృష్ణ వంటి సీనియర్ స్టార్ హీరోల నుంచి ఏడాదిలో లెక్కలేనన్ని సినిమాలు వచ్చేవి. అయితే, ఇప్పుడా పరిస్థితి లేదు. ఒకప్పుడు ఏడాదిలో డజన్ సినిమాలు చేసిన మెగాస్టార్ సైతం ఇప్పుడు ఏడాదికి కనీసం ఒక్కటంటే ఒక్క సినిమా కూడా విడుదల చేయలేక తడబడుతున్నారు. ఒక్క చిరంజీవే కాదు..
ఇండస్ట్రీలో ఉన్న ఏ స్టార్ హీరోను తీసుకున్నా.. గత రెండు దశాబ్దాలుగా ఏడాదికి కనీసం ఒకటి లేదా రెండు సినిమాలైనా విడుదల చేయలేకపోతున్నారు. చిన్న హీరోలు కూడా ఏడాదిలో రెండు సినిమాలు విడుదల చేయలేని పరిస్థితి. ఇలా సినిమాలు తక్కువగా వస్తే ముందుముందు ఇండస్ట్రీ మరింత కుదేలయ్యే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇప్పటికే సగానికి పైగా కనుమరుగయ్యాయి. ప్రేక్షకులు సినిమాలకు రావడం లేదు. ఇలాంటి సమయంలో స్టార్ హీరోలు రెండు మూడేళ్లకో సినిమా తీస్తే ఇండస్ట్రీ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.
ఏడాదికి రెండు సినిమాలు వచ్చేలా..
సినిమాలు తగ్గడం.. వసూళ్లు తగ్గుముఖం పట్టడం వంటి పరిస్థితుల నేపథ్యంలోనూ హీరోలు తమ పారితోషికాలు తగ్గించుకునేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని విమర్శలున్నాయి. అయితే, ఎక్కువ సినిమాలు చేయడం ఉత్తమం అని హీరోలంతా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ఇంతకు ముందు ఏడాదికి కనీసం ఒక్క సినిమానైనా చేయని హీరోలు ఇప్పుడు తమ నుంచి ఏడాదిలో కనీసం రెండు సినిమాలు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
గతంలోనే కొందరు హీరోలు ఇలా ఏడాదికి రెండు సినిమాలు చేయాలని భావిస్తున్నట్టు ప్రకటించారు కూడా. కానీ ఏ ఒక్కరికీ అది సాధ్యం కాలేదు. ముఖ్యంగా కరోనా తర్వాత వచ్చిన మార్పుల కారణంగా ప్రస్తుత ఇండస్ట్రీ పరిస్థితుల నేపథ్యంలో ఏడాదిలో రెండు సినిమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మహేశ్‌బాబు తప్ప మిగతా హీరోలంతా చాలా స్పీడ్ పెంచేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే రెండేసి, మూడేసి ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. చిరంజీవి, బాలకృష్ణతోపాటు ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ సైతం చాలా వేగంగా సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు హీరోలు ఇప్పటికీ భారీ బడ్జెట్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ అవి తక్కువ సమయంలో పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇది ఆచరణ సాధ్యమైతే వచ్చే ఏడాది నుంచి స్టార్ హీరోల నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే, ఈ జాబితాలో ప్రభాస్ ముందు వరుసలో ఉన్నారు. ఆయన నుంచి వరుసగా రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్2, కల్కి2 సినిమాలు రాబోతున్నాయి.
రెండు దశాబ్దాల తర్వాత..
రెండు దశాబ్దాల తర్వాత ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు వరుసగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకు ముందులా కాకుండా వందల కోట్ల బడ్జెట్‌తో కాకుండా, సింపుల్‌గా సినిమాలు చేయాలని కొందరు హీరోలు భావిస్తున్నారు. ఏదేమైనా, అగ్ర తారలు ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేయాలనుకోవడం, యంగ్ స్టార్స్ ఏడాదిలో మూడు సినిమాలను విడుదల చేయాలనుకోవడం శుభ శకునంగానే భావించాలి.
హీరోలు ఏడాదికి రెండు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కొందరు దర్శకులు పడనివ్వడం లేదు. రాజమౌళి వంటి దర్శకులు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయడానికే మూడు నాలుగు ఏళ్లు టైమ్ తీసుకుంటున్నారు. మరోవైపు అనిల్ రావిపూడి వంటి దర్శకులు మూడు నాలుగు నెలల్లోనే సినిమాను పూర్తి చేస్తున్నారు. దర్శకులు ఆరు నెలలకు ఒక సినిమాను తీస్తే అప్పుడు ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చినట్టే!
విజయ్ దేవరకొండ చేతిలో అర డజను సినిమాలు..
కొంతకాలంగా ఆశించిన మేర విజయాలు అందుకోకపోయిన విజయ్ దేవరకొండ తాజాగా ‘కింగడమ్’తో హిట్ కొట్టాడు. ఈ సినిమా రెండు రోజుల్లోనే 53 కోట్లు వసూలు చేసింది. ఈ క్రమంలో ఆయన తర్వాతి ప్రాజెక్టులపై అంతా ఆసక్తి నెలకొంది. తాజాగా విజయ్ దేవరకొండ తన నెక్స్ సినిమాల లైనప్ చెప్పడంతో అభిమానుల్లో ఆనందం వెయ్యింతలైంది.
విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో మైత్రి నిర్మాణంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు చివరలో ప్రారంభం కానుంది. ఇందులో రాయలసీమ యువకుడిగా కనిపించబోతున్నారు. ఈ సినిమా సీమ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుంది. ఆ తర్వాత రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఆంధ్రా నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది.
అనంతరం సుకుమార్‌తో ఒక సినిమా బ్యాలెన్స్ ఉంది. ఈ విషయం కూడా క్లారిటీ ఇచ్చాడు విజయ్. సుకుమార్.. రామ్‌చరణ్‌తో సినిమా పూర్తయిన తర్వాత విజయ్‌తో చేస్తాడని సమాచారం. ఇక ‘కింగ్‌డమ్’కు పార్ట్2, పార్ట్3 కూడా ఉన్నాయని చెప్పాడు. పార్ట్2 సీక్వెల్ కాగా, పార్ట్3 మొదటి భాగానికి ప్రీక్వెల్. ఈ రెండు సినిమాలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ నిర్మాణంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్నాయి.
అలాగే సందీప్ రెడ్డి వంగతో కూడా కచ్చితంగా ఇంకో సినిమా ఉంటుందని, అతని చేతిలో ఉన్న ప్రభాస్, అల్లు అర్జున్, ‘యానిమల్’ సీక్వెల్ సినిమాల తర్వాత తన సినిమా ఉండొచ్చని తెలిపాడు విజయ్. ఇలా విజయ్ దేవరకొండ చేతిలో అరడజను భారీ సినిమాలు పెట్టుకొని దూసుకుపోతున్నాడు.