calender_icon.png 12 August, 2025 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కథ.. మళ్లీ మొదటికే

26-10-2024 12:00:00 AM

భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టు

  1. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 156 ఆలౌట్ 
  2.   301 పరుగుల ఆధిక్యంలో కివీస్

* న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా కథ మళ్లీ మొదటికే వచ్చింది. తొలి టెస్టులో బ్యాటింగ్ వైఫల్యంతో ఘోర ఓటమిని మూటగట్టుకున్న భారత్ రెండో టెస్టులోనూ పరాజయం వైపు నిలబడింది. ఇప్పటికే 301 పరుగుల స్పష్టమైన ఆధిక్యం సాధించిన కివీస్ టీమిండియా ముంగిట భారీ లక్ష్యాన్ని నిర్ధేశించే చాన్స్ ఉండడంతో భారత్ ఓటమి నుంచి తప్పించుకోవడం అసాధ్యం..!

387 స్వదేశంలో టెస్టుల్లో భారత్ ఛేదించిన అత్యధిక పరుగుల టార్గెట్ ఇదే. 2008 చెన్నై టెస్టులో ఇంగ్లండ్‌పై ఈ ఫీట్‌ను సాధించింది.

పుణే: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతోంది. తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో కుదురుకున్నట్లే అనిపించిన బ్యాటింగ్ రెండో టెస్టుకొచ్చేసరికి మళ్లీ పాత కథే షురూ అయింది.

పుణే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ కలుపుకొని 301 పరుగులతో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. టామ్ బ్లండెల్ (30*), పిలిప్స్ (9*) క్రీజులో ఉన్నారు.

భారత బౌలర్లలో సుందర్ 4 వికెట్లు పడగొట్టాడు. చేతిలో మరో ఐదు వికెట్లు ఉండడంతో న్యూజిలాండ్ మరో 50 నుంచి వంద పరుగులు జత చేసినా ఆధిక్యం 350కి పైనే ఉండనుంది. స్పిన్‌కు విపరీతంగా అనుకూలిస్తున్న పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫల మైన మన బ్యాటర్లు మ్యాచ్ ను గెలిపిస్తారనుకోవడం అత్యాశే. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో కనీసం డ్రా చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది.

మారని ఆటతీరు.. 

తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ ఆటతీరుకు కొనసాగింపు అన్నట్లుగా టీమిండియా బ్యాటింగ్ కొనసాగింది. 16/1 క్రితం రోజు స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు జైస్వాల్ , గిల్ శుభారంభం అందించారు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించాకా గిల్ (30) ఔటయ్యాడు. ఇక్కడి నుంచి భారత్ కథ మళ్లీ మొదటికే వచ్చింది.

క్రీజులోకి వచ్చిన కోహ్లీ (1) సాంట్నర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యి తీవ్రంగా నిరాశపరిచాడు. కాసేపటికే జైస్వాల్ (30) పెవిలియన్  చేరగా.. ఆ తర్వాత పంత్ (18), సర్ఫరాజ్ (11) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. అశ్విన్ (4) ఇలా వచ్చి అలా వెళ్లడంతో 103 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది.

ఈ దశలో జడేజా (38), సుందర్ (18 నాటౌట్) కాసేపు పోరాడడంతో టీమిండియా 150 పరుగుల మార్క్‌ను దాటగలిగింది. ఆ తర్వాత సాంట్నర్ టెయిలెండర్ల పని పట్టాడు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 7 వికెట్లతో రాణించాడు.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ వికెట్లు పడుతున్నప్పటికీ వేగంగా ఆడేందుకు ప్రయత్నించింది. కెప్టెన్ టామ్ లాథమ్ (86) ధాటిగా ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన సుందర్.. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి తొలిసారి పది వికెట్ల హాల్ అందుకున్నాడు.