calender_icon.png 5 September, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులే లక్ష్యం!

05-09-2025 12:00:00 AM

-యథేచ్ఛగా మత్తు పదార్థాల విక్రయం

-గంజాయి, డ్రగ్స్‌కు బానిసలుగా యువత

-గత నెలలో రెండు విద్యాసంస్థల స్టూడెంట్స్‌కి పాజిటివ్

-ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు

మేడ్చల్,  సెప్టెంబర్ 4(విజయక్రాంతి): హైదరాబాద్ నగరం ఆనుకుని విస్తరించి ఉన్న మేడ్చల్ జిల్లాలో విద్యార్థులే లక్ష్యంగా మత్తు పదార్థాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మేడ్చల్ జిల్లాలోని అత్యధికంగా మెడికల్, ఇంజనీరింగ్, ఇతర కాలేజీలు, యూనివర్సిటీలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా హాస్టళ్ళు ఉన్నాయి.

విద్యార్థులు అను బంధ హాస్టల్లోనే కాకుండా, ప్రైవేట్ హాస్టల్లోనూ ఉంటున్నారు.  జిల్లాలో ఒకే నెలలో రెండు పేరొందిన విద్యాసంస్థల విద్యార్థులు మత్తు పదార్థాల కేసులో పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల బహదూర్ పల్లి సమీపంలోని మహేంద్ర యూనివర్సిటీ లో మత్తు పదార్థాల కేసులో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు అరెస్టయ్యారు. ఈగలు టీం హాస్టల్ లో తనిఖీ చేయగా 1.15 కిలోల గంజాయి, 47 గ్రాముల ఓ జి వైడ్ తో పాటు 28 ప్యాకెట్లు లభించాయి.

ఈ కేసులో ఢిల్లీకి చెందిన మహమ్మద్ అప్రారు జావిద్ ఖాన్, మణిపూర్ కు చెందిన నేవీ రాంగ్ రాంగ్, జీడిమెట్లకు చెందిన అంబటి గణేష్, భూస శివకుమార్ అరెస్ట్ అయ్యారు. విక్రయదారుల వద్ద 50 మంది కొనుగోలుదారుల నంబర్లు లభ్యమయ్యాయి. విద్యార్థు లకు పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్ రావడంతో తల్లిదండ్రులకు సమా చారం ఇచ్చారు. ఆగస్టు నెలలోనే మేడ్చల్ మండలంలోని ఘన్పూర్‌లో గల మెడిసిటీ మెడికల్ కాలేజీ విద్యార్థులు 8 మందికి గంజాయి పాజిటివ్ వచ్చింది. గంజాయి విక్రయిస్తున్న వారి వద్ద 84 మంది కొనుగోలుదారుల ఫోన్ నెంబర్లు లభ్యమయ్యాయి. ఇందులో 26 మంది మెడిసిటీ మెడికల్ కాలేజ్ విద్యార్థులు కాగా, మిగతావారు వివిధ కాలేజీల వారు ఉన్నారు.

విక్రయదారుల వద్ద విద్యార్థుల ఫోన్ నెంబర్లు 

మత్తు పదార్థాలు విక్రయిస్తూ పట్టుబడిన వారి వద్ద విద్యార్థుల ఫోన్ నెంబర్లు లభిస్తున్నాయి. ఇటీవల బోయిన్పల్లి కి చెందిన అరాఫత్ ఖాన్ గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డాడు. ఇతనికి కర్ణాటకలోని బీదర్ కు చెందిన జరీనా భాను సరఫరా చేస్తున్నట్టు తేలడంతో వీరిద్దరిని అరెస్టు చేశారు. వీరి వద్ద 84 మంది విద్యార్థుల ఫోన్ నెంబర్లు లభించాయి. పలువాల్లో విద్యార్థుల ప్రైవేట్ హాస్టల్లు ఒకే చోట ఎక్కువగా ఉన్నాయి.

ప్రాంతంలో విద్యార్థులకు అరాఫత్ ఖాన్ గంజాయి విక్రయించేవాడు. మెడిసిటీ మెడికల్ కాలేజీ విద్యార్థులు అక్కడే హాస్టల్లో ఉంటున్నారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని ఇచ్చిన సమాచారంతో మహేంద్ర యూనివర్సిటీ హాస్టల్లో తనిఖీలు చేశారు. ఢిల్లీ నుంచి కొరియర్ల ద్వారా మత్తు పదార్థాలు వస్తున్నట్లు తేలింది. హాస్టల్లోనే కాకుండా విద్యార్థులు బయట రూములు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. రూములలో కూడా గంజాయి సేవిస్తున్నారు. ఇటీవల మేడ్చల్ పట్టణంలోని ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్న విద్యార్థులు గంజాయి సేవిస్తుండడంతో స్థానికులు అప్పటికప్పుడు వారిచే ఖాళీ చేయించారు.

తల్లిదండ్రుల ఆందోళన ...

మత్తు పదార్థాల కేసులో విద్యార్థులు పట్టుబడుతుండడంతో వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఒకరిని చూసి ఒకరు తమ పిల్లలు అలవాటు చేసుకుంటారు అని భయపడుతున్నారు. ఉన్నత చదువులు ఏమోగానీ జీవితాలు నాశనం అవుతాయని అంటున్నారు. ఈగల్ అధికారు లు ఎప్పటికప్పుడు అన్ని హాస్టల్లో తనిఖీ చేసి మత్తు పదార్థాల వినియోగం అరికట్టాలని కోరుతున్నారు.