calender_icon.png 7 November, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసరా సొమ్ము పోస్టుమాన్ చేతికే..

07-11-2025 12:00:00 AM

ప్రశ్నించిన వారిపై దౌర్జన్యం..

దేవరకొండ, నవంబర్ 6 (విజయక్రాంతి): కొండమల్లేపల్లి మండల పరిధిలోని దేవరోని తండా గ్రామ పంచాయతీ కి చెందిన వృద్ధులు, వికలాంగుల పింఛన్ల మీద పోస్ట్మాన్ అక్రమాలు చేస్తున్నాడని లబ్ధిదారులు బహిరంగంగా ఆరోపించారు. ప్రభుత్వంచే ప్రతి నెలా అందే పింఛన్లను దేవరోని తండాకు చెందిన పోస్ట్మాన్ షేక్ జహంగీర్  ప్రతి నెల ఇవ్వకుండా మూడు నెలలకు ఒకసారి మాత్రమే అందిస్తూ, అందులోను రెండు నెలల పింఛన్ మాత్రమే ఇవ్వడం, మిగతా ఒక నెల పింఛన్ ఇవ్వకపోవడంపై  తండావాసులు మండిపడ్డారు.

వృద్ధులు, వికలాంగులు, వితంతువులు మాకు రావలసిన పింఛన్లను దోచుకుంటే ఎలా  ప్రభుత్వమే ఇచ్చిన హక్కును ఇలా దోపిడీ చేయడం నేరం కాదా అంటూ తండాల్లో ఒక యువకుడికి చెప్పగా యువకుడు నేరుగా నలగొండ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వెంటనే కలెక్టర్ ఫిర్యాదును స్వీకరించి కొండ మల్లేపల్లి మండల ఎంపీడీవోకు విచారణ ఆదేశాలు జారీ చేశారు. నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాటి ఆదేశాల మేరకు  కొండమల్లేపల్లి మండల ఎంపీడీవో దేవరోని తండకు సందర్శించి పోస్ట్ మాన్ ని పిలిపించి అక్కడే లబ్ధిదారుల ముందు బహిరంగ విచారణ చేపట్టారు.విచారణ సమయంలో పోస్ట్మాన్ నేను సక్రమంగానే ఇస్తున్నాను అని చెప్పడంతో, అక్కడే ఉన్న లబ్ధిదారులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.

అబద్ధాలు ఆపండి మూడు నెలల పింఛన్ డబ్బును రెండు నెలల డబ్బు ఇస్తూ ఒక నెల పింఛన్ మింగేస్తున్నది మీరే అంటూ ప్రత్యక్షంగా ప్రశ్నించారు.మాకు రావలసిన ప్రతీ పైసా తిరిగి ఇవ్వాలి అని పోస్ట్ మాన్ పై మండిపడ్డారు. ఇలాంటి పోస్ట్మాన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వెంటనే మాకు ఈ పోస్ట్ మాన్ ని కాకుండా వేరే పోస్ట్మాన్ ని పంపాలని లబ్ధిదారులు అధికారులను కోరారు. ఈ విషయంపై విచారణ చేపట్టిన కొండమల్లేపల్లి ఎంపీడీవో ఈ ఘటనపై పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పించనున్నట్లు తెలిపారు. పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు కూడా లబ్ధిదారులకు న్యాయం చేయడంలో ముందుకు రావడంలేదని రాజకీయ నాయకులపై, మాజీ ప్రజా ప్రతినిధులపై గ్రామస్తులు తీవ్ర విమర్శలు చేశారు.