24-08-2025 12:15:20 AM
బడికి వచ్చామా.. పిల్లలకు చదువు చెప్పామా.. ఇంటికి వెళ్లామా అనే తరహాలో కాకుండా ఆ టీచర్ ప్రభుత్వ బడిని బతికించాలనే తపనతో చేసిన కృషి ఫలించింది. గత ఏడాది ముగ్గురు విద్యార్థులు ఉన్న బడిలో 26 మందిని.. అది కూడా పూర్తిగా ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వ బడిలో చేర్పించి బడికి పునర్జీవం పోసింది.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం ఖాసీం తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల టీచర్ పోలోజు మంజుల కృషితో ఇప్పుడు ఆ పాఠశాల కార్పొరేట్ తరహాలో మారిపోయింది. గత ఏడాది పాఠశాలకు బదిలీపై వచ్చిన టీచర్ మంజులకు పాఠశాలలో కేవలం ఇద్దరు విద్యార్థులే ఉండడంతో ఆశ్చర్యపోయింది. దీనితో తండా పరిధిలోని ఇండ్లలో గత వేసవికాలంలో ఇంటింటి సర్వే నిర్వహించి 26 మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలకు వెళ్తున్న విషయాన్ని గుర్తించింది.
దీనితో వారిని ఈ ఏడాది తండాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. దీనికి తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలల్లో చేర్పిస్తామని, అయితే మధ్యాహ్నం 3:30 వరకే పిల్లల్ని వదిలేయడం వల్ల తాము వ్యవసాయ పనులకు వెళ్లి రావడానికి ఆలస్యం అవుతుందని, అప్పటివరకు తమ పిల్లల రక్షణ బాధ్యత ఎవరు చూసుకుంటారని ప్రశ్నించారు.
సాయంత్రం 4:30 గంటల వరకు పాఠశాల నిర్వహిస్తే తమ పిల్లలను పంపిస్తామని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రుల సూచన తాను పాటిస్తానని మంజుల టీచర్ హామీ ఇవ్వడంతో తండాలో 5వ తరగతి లోపు చదువుతున్న విద్యార్థులు అందరినీ ఈ ఏడాది ప్రభుత్వ బడిలో చేర్పించారు.
దాతల సహకారం
తల్లిదండ్రులకు ఇచ్చిన మాటకు కట్టుబడి టీచర్ మంజుల విద్యార్థులను పాఠశాలలో చేర్పించి వారికి సొంతంగా రూ. 9వేలతో ప్రత్యేక దుస్తులు, బ్యాగులు అందజేశారు. ప్రేమ్‌కుమార్ అనే దాత ద్వారా తొలుత టై, బ్యాడ్జి, బెల్టులు ఇప్పించారు. డాక్టర్ రంజిత్ రెడ్డి ద్వారా షూ ఇప్పించారు. ముగ్గురు ఉన్న పాఠశాలలో 26 మంది విద్యార్థులు చేరడంతో నేలపై కూర్చొని చదువుకోలేకపోతున్న విషయాన్ని జీసీడీవో విజయకుమారి దృష్టికి తీసుకువెళ్లగా ఆమె ప్రత్యేకంగా ఫర్నీచర్ ఇప్పించారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో విద్యాబోధన కోసం మండల విద్యాధికారి బాలాజీ అదనంగా మరో టీచర్‌ను డిప్యూటేషన్ ఇచ్చారు.
ఆటపాటలతో పాఠాలు
టీచర్ మంజులతో పాటు మరో టీచర్ మాధవి కలిసి విద్యార్థులకు కృత్యాధార బోధన, సులువుగా అర్థమయ్యే విధంగా ఆటపాటలతో పాఠాలు చెప్పడంతో తల్లిదండ్రు లు ఇప్పుడు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీచర్ మంజుల కృషితో దాతల సహకారంతో పాఠశాలలో ప్రస్తుతం మౌలిక వసతులు సమకూర్చి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కృషి చేశారు. మూసివేతకు దగ్గరగా ఉన్న ప్రభుత్వ బడిని బతికించిన మంజుల టీచర్‌ను జిల్లా విద్యాధికారి డాక్టర్ ఏ. రవీందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. దీనితో ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు కార్పొరేట్ తరహాలో రూపుదిద్దుకొని విద్యార్థులతో కళకళలాడుతోంది.
బండి సంపత్ కుమార్,
మహబూబాబాద్ (విజయ క్రాంతి)