24-08-2025 12:15:48 AM
అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితం
స్టెంట్లు, బైపాస్, ఓపెన్ హార్ట్ తదితర ఖరీదైన సర్జరీలు సైతం
తల్లి మాటకు కట్టుబడి ఉచిత వైద్యం అందిస్తున్న మర్రి రాజశేఖర్‌రెడ్డి
వైద్యం ఈ రోజుల్లో వ్యాపార వస్తువుగా మారిపోయింది. రోగంతో ఆసుపత్రుల్లో చేరితే ముందు డబ్బులు డిపాజిట్ చేస్తే గాని వైద్యం మొదలు పెట్టరు. డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత అవసరం లేని టెస్టులు రాస్తున్నారు. రోగి చనిపోయినా వైద్యం చేస్తున్నట్లు నటించి డబ్బులు గుంజిన సందర్భాలు ఉన్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు మెడికల్ కాలేజీల అనుబంధ ఆసుపత్రులలో అందిన కాడికి దండుకుంటున్నారు.
వైద్యరంగంలో సేవ అనేదే లేకుండా పోయింది. కానీ మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ సమీపంలోని అరుంధతి ఆసుపత్రి ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తూ రోగులకు వరంగా మారింది. ఈ ఆసుపత్రిలో అన్నిరకాల రోగాలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. అరుంధతి ఆసుపత్రి మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉంది. కొన్ని మెడికల్ కాలేజీల అనుబంధ ఆసుపత్రులలో బేసిక్ వైద్య సేవలు మాత్రమే అందిస్తున్నారు.
ఇక్కడ మాత్రం స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఈ ఆసుపత్రికి వెళితే ఆరోగ్యశ్రీ, హెల్త్ కార్డు లేకున్నప్పటికీ ఉచితంగా వైద్యం చేస్తున్నారు. స్టెంట్లు, ఓపెన్ హార్ట్, బైపాస్, వెన్నెముక వంటి ఖరీదైన చికిత్సలు ఉచితంగా చేస్తున్నారు. మేడ్చల్ జిల్లాకు, హైదరాబాద్ నగరానికి దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉపాధి కోసం అధిక సంఖ్యలో వచ్చారు. వీరిలో చాలామంది ఇక్కడ ఉచిత వైద్య సదుపాయం సద్వినియోగం చేసుకుంటున్నారు.
70 కార్డియాలజీ సర్జరీలు
ఆసుపత్రిలో 2022 జూలై ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు 5,85,831 మందికి ఉచిత వైద్యం అందించారు. ఇందులో 33,148 మంది ఇన్‌పేషెంట్లు. ఇప్పటివరకు 11,250 వివిధ రకాల సర్జరీలు చేశారు. ఇందులో ఖరీదైన కార్డియాలజీ సర్జరీలు 70 ఉచితంగా చేశారు. ప్రతిరోజు సగటున 40 మందికి ఎంఆర్‌ఐ, 35 మందికి సిటీ స్కాన్ చేస్తున్నారు. ప్రతిరోజు ఓపి సగటున 1,500 ఉంది.
తల్లి సూచనతో ఉచిత వైద్యం
మర్రి రాజశేఖర్‌రెడ్డి విద్యాసంస్థల అధిపతి. తల్లి పేరున ఆసుపత్రి స్థాపించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తల్లి అరుంధతితో చెప్పారు. పేద ప్రజలకు వైద్య సేవలు ఉచితంగా అందించాలనుకుంటే నా పేరు పెట్టు.. వ్యాపార వస్తువుగా మార్చి నా పేరు అప్రతిష్ట పాలు చేయకు అని కరాఖండిగా చెప్పింది. దీంతో మర్రి రాజశేఖర్‌రెడ్డి తల్లి అరుంధతి పేరు మీద 600 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు.
- మేడ్చల్, విజయక్రాంతి
ఏ కార్డు లేకున్నా ఆపరేషన్ చేశారు
మాది ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల. గుండె వేగంగా కొట్టుకోవడంతో అరుంధతి హాస్పిటల్‌లో చేరాను. వైద్యులు ఈపీఎస్ ప్లస్ ఆర్‌ఎఫ్‌ఏ ఆపరేషన్ చేశారు. మాకు ఎలాంటి ఆరోగ్యశ్రీ, హెల్త్ కార్డులు లేవు. హాస్పిటల్‌లో ఉచితంగానే ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్‌కు బయట లక్షన్నర నుంచి 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. ఇక్కడ మాత్రం ఒక్క రూపాయి తీసుకోలేదు.
- బ్లేస్సి దేబోరా (22), బాపట్ల
ఉచితంగా ఆపరేషన్ చేశారు
మా స్వస్థలం బీహార్, ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చి చింతల్‌లో ఉంటున్నాం. గుండెనొప్పితో (డీవీటీ) అరుంధతి ఆస్పత్రిలో చేరాను. గుండె వీనస్‌లో ఐవీసీ ఫిల్టర్ వేశారు. తగ్గిన తర్వాత మళ్లీ తీసేశారు. ఉచితంగానే చేశారు. ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్నాను. అభినవ్ పాండే (31), చింతల్