30-12-2025 12:59:10 AM
పాఠశాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న మల్లేశ్
ఆటల్లో రాణిస్తున్న విద్యార్థులు
పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న స్టూడెంట్స్
జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), డిసెంబర్ 29: ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు హాయిగా బతికేయొచ్చు అనుకుంటున్న నేటి రోజుల్లో ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా నిబద్ధతతో పని చేసేటువంటి వారు చాలా అరుదు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు సమాజంలో ఉన్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. అందు లో కూడా నిస్వార్థంతో పనిచేసేవారు చాలా తక్కువ మందే. వారిలో ఒక్కరు ఈ ఆటల మాస్టారు పి.మల్లేష్. మండల కేంద్రమైన అర్వపల్లిలోని జడ్పీహెచ్‌ఎస్ ఫిజికల్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన నాటినుండి నేటి వరకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సహకారంతో కష్ట పడుతూ పాఠశాల అభివృద్ధికి కృషిచేస్తున్నాడు.
క్రీడా మైదానం అందుబాటులోకి..
గతంలో పాఠశాల ఆవరణలో విపరీతమైన రాళ్లు,రప్పలతో నడవడానికి అధ్వానంగా ఉన్న పాఠశాల ఆవరణను బిగ్ హెల్ప్ సంస్థ, దాతల సహకారంతో నిర్విరామంగా కష్టపడి నేడు ఒక అందమైన క్రీడా మైదానంగా తీర్చిదిద్దారు. దీంతో ఆ మైదానంలో రెండు వాలీబాల్ కోర్టులు, ఒక ఖో-ఖో కోర్టు, షటిల్ కోర్టుతో పాటు లాంగ్ జంపు, హై జంపు కోర్టులు ఏర్పాటు చేశారు. సుమారు 300మంది విద్యార్థులను ప్రతినిత్యం ఆటలాడిస్తూ ఆటల్లో మెలకువలు నేర్పుతూ క్రమశిక్షణ ఇచ్చి జిల్లా స్థాయిలో 15మంది విద్యార్థులను మరియు అస్లాం,ఫాతిమా,ప్రదీప్,చరణ్ అను నలుగురిని రాష్ట్రస్థాయికి తీసుకెళ్లారు.
ప్రైవేటుకు ధీటుగా పాఠశాల
పాఠశాలలోని విద్యార్థులను వారి తల్లిదండ్రులను ప్రతిరోజు మోటివేషన్ చేస్తూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా బాలబాలికలకు 4 రకాల యూనిఫామ్ లు ధరించేలా చేస్తూ జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తూ చక్కటి క్రమశిక్షణతో విద్యార్థులు నడుచుకునేటట్లుగా చేస్తూ ఉన్నతాధికారుల మన్ననలు పొందుతున్నారు. అందుకు అధికారులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు.
పాఠశాలలో బిగ్‌హెల్ప్ సంస్థ ఏర్పాటు
పాఠశాలలో పీడీగా బాధ్యతలు చేపట్టిన పిదప పాఠశాలలో తల్లిదండ్రులు లేని పిల్లలను గమనించి వెంటనే బిగ్ హెల్ప్ సంస్థ అధినేత షేక్ చాంద్ పాషాను సంప్రదించి 14 నవంబర్ 2023న అనాధ, పేద విద్యార్థుల కోసం సంస్థ ఏర్పాటు చేసి15మంది తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ప్రతినెల వారికి కావలసిన వస్తువులతో పాటు పాఠశాలకు రూ.70వేలు విలువ చేసి సౌండ్ సిస్టంను అందించారు.అలాగే ఎఫ్‌ఏ -1నుండి ఎఫ్‌ఏ-4 వరకు జరిగిన పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డెన్ అవార్డులను అందజేశారు. వార్షిక పరీక్షల్లో ప్రతి తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రూ.5వేల చొప్పున మొత్తం రూ.25 వేలను అందించడంలో కీలకపాత్ర పోషించారు.
విద్యార్థులు ఉన్నత స్థితికి చేరేలా చేయడమే నా లక్ష్యం
గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో మట్టిలో మాణిక్యాల లాంటి విద్యార్థులు ఉంటారు. వారిలో క్రీడా నైపుణ్యాలను మెరుగుపరిచి ఉన్నత స్థితికి చేరుకునేలా చేయడమే నా లక్ష్యం. అందుకు ఉపాధ్యాయ బృందం, గ్రామస్తుల సహకారం తప్పకుండా తీసుకుంటా.
- పి మల్లేష్ ఫిజికల్ డైరెక్టర్
జడ్పీహెచ్‌ఎస్ అర్వపల్లి
క్రమశిక్షణ పెరుగుతుంది
మా పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ మల్లేష్ సార్ వచ్చిన నాటినుండి వాలీబాల్ అంటే ఏంటో తెలిసింది. గతంలో తెలిసేది కాదు.ఇప్పుడు సారు మాకు వాలీబాల్ ఆటను నేర్పి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేలా చేశారు.ఆటలతో పాటు ఆరోగ్యం,క్రమశిక్షణ అలవడుతుంది.
కె ఫాతిమా 10వ తరగతి విద్యార్థిని