15-07-2025 12:00:00 AM
ప్రజావాణిలో ప్రజాసంఘాల వినతి.
నాగర్ కర్నూల్ జులై 14 (విజయక్రాంతి)చీటికి మాటికి చీదరిస్తూ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ గోడకుర్చీలు వేయించడం చేతిపై వాతలు పెడుతూ విద్యార్థులను టార్చర్ చేసే టీచర్ ఉంటే మేము పాఠశాలకు రాలేమంటూ కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులు తెగేసి చెప్తున్నారని అలాంటి టీచర్ను వెంటనే విధుల్లోంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా ప్రజాసంఘాల నేతలు ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్ కు సోమవారం ఫిర్యాదు చేశారు.
గత విద్యా సంవత్సరం ముగిసే సమయంలో నాగనూలు కస్తూర్బా గాంధీ పాఠశాలలో పనిచేస్తున్న కళ్యాణి అనే సిఆర్టి విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రజా సంఘాల నుంచి భారీ ఎత్తున నిరసన గళం వినిపించింది. విద్యార్థులు బట్టలు మార్చుకునే సమయంలో ఫోటోలు వీడియోలు తీసి ఇతరులకు పంపుతూ ఇబ్బందులకు గురిచేసిందని బాధిత విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ఆమెపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు పోలీసులు కూడా ఫోక్సో కేసు నమోదు చేశారు. కానీ ఉన్నత వర్గానికి చెందిన టీచర్ కావడంతోనే రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు ఎలాంటి విచారణ జరపలేదని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
దీంతోపాటు జిల్లా విద్యాశాఖ అధికారులు సైతం ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోక ముందే పెంట్లవెల్లి కేజీబీవీ పాఠశాలకు బదిలీ చేసి చేతులు దులిపేస్తున్నారు. దీంతో అక్కడ కూడా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెను వెంటనే తొలగించాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామనిహెచ్చరించారు.