24-12-2025 12:44:37 AM
మహబూబాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి నూతనంగా తీసుకొచ్చిన వీబీజీ రామ్ జీ బిల్లును రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సెంటర్ లో పత్రాలను తగలపెట్టి నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి కుంట్ల నాగన్న మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను అమలు చేయడంలో భాగంగా ఉపాధి హామీ చట్టాన్ని రాముని పేరుతో బిల్లు తీసుకొచ్చిందని, దేవుని పేరుతో కోట్లాది మంది ప్రజల ఉపాధిని కాల రాసిందన్నారు.
కూలీలకు చెల్లించే నిధులు ఎవరు చెల్లించాలనే స్పష్టత లేదన్నారు. జాబ్ కార్డులు రెగ్యులేషన్ పేరుతో ఇప్పటికే కోట్లాదిమంది ఉపాధి కూలీల తొలగింపు ప్రక్రియను ప్రారంభించిందన్నారు. నూతన పథకంలో 120 రోజులుకు పొడిగించామని మభ్యపెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని, ఆర్థిక లోటుతో రాష్ట్రాలు ఉపాధి హామీ పథకానికి నిధులు చెల్లించకుంటే ఉపాధి పనులు ప్రమాదంలో పడే ప్రమాదం ఉందన్నారు.
ఇప్పటికైనా తక్షణమే రద్దు చేసుకోవాలని లేని ఎడల పెద్ద ఎత్తున ప్రజలను, కార్మికులను కూలీలను సమీకరించి ఆందోళన పోరాటాలు చేస్తామన్నారు..ఈ కార్యక్రమంలో సారయ్య, వెంకటనారాయణ, యాకన్న, బత్తుల వెంకన్న, రవి, హేమ, సేవ్య, యాదగిరి, రాజు, మహేందర్, మోహన్, జనార్ధన్, వెంకటయ్య, లక్ష్మణ్, శ్రీను, నవీన్, ఎలేందర్, జయరాజ్, మహేందర్, లచ్చు పాల్గొన్నారు.