07-01-2026 12:00:00 AM
సిద్దిపేట, జనవరి 6 (విజయక్రాంతి): రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో పేరుకుపోయిన చెత్తను గ్రామ సర్పంచులు తొలగించాల్సిందేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచులకు ఏర్పాటుచేసిన సన్మాన సమావేశంలో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. కెసిఆర్ హయాంలోనే రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు అవార్డులు, రివార్డులు సాధించాయని చెప్పారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, డంపు యాడు, వైకుంఠధామం ఏర్పాటు చేసిన ఘనత కేసిఆర్ పరిపాలనకు దక్కిందన్నారు.
సిద్దిపేట నియోజకవర్గంలో గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ఎన్నికైన సర్పంచులకు తన శక్తికి మించిన సహకారం అందిస్తానని వెల్లడించారు. ప్రజాప్రతినిధులందరం కుటుంబ సభ్యులుగా మెదులుకొని ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.