05-05-2025 02:09:06 AM
గ్రామాలకు సరిపడా నీరు లేక ప్రజల తీవ్ర ఇబ్బందులు
ప్రత్యామ్నాయ మార్గం చూపని అధికారులు
యాచారం, మార్చి 4: మండలంలోని వివిధ గ్రామాలలో జనం దాహంతో అల్లాడి పోతున్నారు. ప్రజలు నీటి కోసం కష్టాలు పడుతున్నారు. అసలే ఎండకాలం.. ఆ పై నీటి సమస్య. గొంతు ఎండుతున్నా ఆదుకునే అధికారులు కరువు అయ్యారు. సమస్య చెప్పినా పట్టించుకునే పాపాన పోవటం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులు, వాగులు ఒట్టిపోవడంతో భూగర్భజలాలు పాతాళానికి పడిపోయాయి.
బోరుబావుల నుంచి చుక్క నీరు రాక పల్లెల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రజలు బిందెడు నీటి కోసం అల్లాడుతున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పలు గ్రామాల్లో నీటి సరఫరా పూర్తిగా నిలిచి పోయింది. దాంతో ఆయా గ్రామాల ప్రజలకు నీటి ట్యాంకర్లే దిక్కయ్యాయి.
గ్రామాల్లో 80 శాతం బోర్లు నీళ్లు లేక ఒట్టిపోయాయి. చెరువులన్నీ అడుగంటి పోవడంతో కనీసం పశువుల దాహార్తికి కూడా నీరు దొరుకని పరిస్థితి నెలకొంది. దాంతో చాలా మంది రైతులు పశువులను సాదలేక కబేలాలకు అమ్ముకునే పరిస్థితి నెలకొంది. రెండు దశాబ్దాల క్రితం వచ్చిన కరువు పరిస్థితులు నేడు మళ్లీ కనిపిస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ట్యాంకర్లతో అరకొర నీటి సరఫరా..
కొన్ని గ్రామాల్లో పంచాయతీ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా అరకొర నీటిని అందిస్తుండగా.. మరికొన్ని గ్రామాల్లో రానున్న సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులు సొంత డబ్బులతో ట్యాంకర్లు తెప్పించి ప్రజలకు నీటిని అందిస్తున్నారు.
కొందరు రైతులు తమ పంటలకు నీరు అందించడానికి ట్యాంకర్ ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారని తెలుస్తోంది. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోర్లు కూడా వట్టిపోయి పంటలకు కూడా నీరు అందక ఎండిపోయే పరిస్థితి నెలకొంది దీనిపై అధికారులు చర్యలు తీసుకుని నీటి కష్టాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.