11-07-2025 12:00:00 AM
సెప్టెంబర్‌లోగానే అన్ని ప్రభుత్వ శాఖల నుంచి ఆర్డర్లు తెప్పించుకోవాలి
చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): చేనేత కార్మికుల వ్యక్తిగత రుణమాఫీ కోసం రూ.33కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ర్టవ్యాప్తంగా 5,691 మంది చేనేత కార్మికులు లబ్ధి పొందుతున్న నేపథ్యంలో వెరిఫికేషన్ ప్రక్రియ త్వరగా పూర్తిచేసి, నిధులు అందజేస్తామన్నారు.
చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పనితీరుపై చేనేత జౌళిశాఖ అధికారులతో గురువారం మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ జౌళి శాఖలో అమలవుతున్న వివిధ పథకాల అమలు గురించి వివరించారు. ఈ సందర్భంగా మం త్రి తుమ్మల మాట్లాడుతూ..
అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్ల నుంచి వచ్చే సంవత్సరానికిగానూ వారికి అవసరమైన వస్త్రాల కోసం సెప్టెంబర్ నెలలోగానే ఆర్డర్లు తెప్పించుకోవాలని సూచించారు. ఇప్పటికే ఆరర్లు ఇచ్చిన ప్రభుత్వ శాఖలకు దుస్తుల పంపిణీని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. టెస్కో నుంచి సంఘాలకు వస్త్రాల ఉత్పత్తికి వర్క్ ఆర్డర్లను వెంటనే అందచేసి, సకాలంలో వస్త్రాల ఉత్పత్తి జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలన్నారు.
నేత కార్మికులకు సంవత్సరం పొడవునా పని కల్పించాలని, స్వయం సహాయక సంఘాల మహిళలకు అందచేసే మహిళాశక్తి చీరల ఉత్పత్తిని వేగవంతం చేయాలని సూచించారు. టెస్కో షోరూంల పనితీరును మెరుగుపరిచి లాభాల బాటలో నడిపించడానికి తగు చర్యలు తీసుకోవాలని, నష్టాలలో ఉన్న టెస్కో షోరూంలను లాభాల్లో ఉన్న షోరూంలలో విలీనం చేయాలని పేర్కొన్నారు.
వేములవాడ నూలు డిపో ద్వారా నేత కార్మికులకు అవసరం మేరకు నూలు అందుబాటులో ఉంచాలని, కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని హైదరాబాద్ నుంచి యాదాద్రి జిల్లా పోచంపల్లిలో శాశ్వత ప్రాతిపదికన సంవత్సరంలోగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
‘జాతీయ’ పురస్కారానికి ఎంపికైన వారికి సన్మానం
భారత ప్రభుత్వం చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ చేనేత పురస్కారం కు ఎంపికైన యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన గజం నర్మద, గూడ పవన్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
దేశవ్యాప్తంగా 19 మంది చేనేత కార్మికులు ఎంపిక కాగా, అందులో తెలంగాణ నుంచి ఇద్దరికి పురస్కారాలు రావడం అభినందనీయమని తెలిపారు. తెలంగాణ చేనేత ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరగడం కోసం ప్రత్యేక లేబుల్‌ను ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.