12-07-2025 01:45:04 AM
* జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
సంగారెడ్డి, జూలై 11(విజయక్రాంతి): విద్యార్థులు దేశ భవిష్యత్తు అని వారికి నాణ్యమైన విద్యా వాతావరణం కల్పించాల్సిన బాధ్యత సంక్షేమాధికారులదేనని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులతో జిల్లాలో వసతి గృహాల నిర్వహణ, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై విస్తృతంగా సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహాలలో మౌలిక సదుపాయాల విషయమే ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ తెలిపారు. వసతి గృహాలలో నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్లు, మంచినీటి నాణ్యత, ఆరోగ్యకరమైన వాతావరణం వంటి అంశాలపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. ప్రతిరోజు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు.
ఆహార నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి మెనూను పాటించకపోతే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. విద్యార్థులకు సరైన సమయంలో పాఠ్యపుస్తకాలు నిబంధనలకు అనుగుణంగా యూనిఫాంలో అవసరమైన పాఠశాల సామాగ్రి అందించాలన్నారు.
వసతిగృహాల్లో మరమ్మతులు చేపట్టాల్సిన మరమ్మతుల వివరాలు అందించాలని, పెండింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కల్లెక్టర్ చంద్రశేఖర్, సాంఘీక సంక్షేమాధికారి అఖిలేష్ రెడ్డి, బీసీ సంక్షేమాధికారి జగదీష్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి దేవుజా పాల్గొన్నారు.