12-07-2025 01:45:20 AM
640 డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరలో పూర్తి చేసి లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు కేటాయిస్తాం:సుడా చైర్మన్ కోమటిరెడ్డి
కరీంనగర్, జులై11(విజయక్రాంతి):ఆనాడు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీగా ఆందోళన చేశాం ఈనాడు అధికార కాంగ్రెస్ ప్రభుత్వంగా అభివృద్ధి చేస్తున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.
జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మరియు మాజీ శాసన సభ్యులు కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై ఓర్వలేక అనవసర ఆరోపణలు చేస్తున్నారని వాళ్ల పాలనలో అద్భుతాలు సృష్టిస్తే ఇప్పుడు అవన్నీ ఆగిపోయినట్టు మాట్లాడడం విడ్డూరంగా ఉందని పదేళ్లలో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసి మేడిగడ్డ ప్రాజెక్టు కట్టిన తొమ్మిది నెలల్లోనే కూలిపోయినట్టు వీళ్లు చేసిన అభివృద్ధి పనులు అదే విధంగా ఉన్నాయని నరేందర్ రెడ్డి విమర్శించారు.
కరీంనగర్ లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అధికారులు పూర్తి చేశారని అందులో అర్హులైన బిఆర్‌ఎస్,బిజెపి కార్యకర్తలతో పాటు అన్ని పార్టీల వాళ్లు ఉన్నారని టెక్నికల్ గా ఇందిరమ్మ కమిటీ నియామకం కొంత ఆలస్యం అయిందని త్వరలో అందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని నరేందర్ రెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నట్టు గతంలో చింతకుంట లోని 640 డబుల్ బెడ్రూం ఇండ్ల విషయంలో ఆందోళన చేసింది వాస్తవమేనని పది సంవత్సరాలలో వాళ్ళు కట్టింది అవి మాత్రమే అని వాటిని కూడా పూర్తి చేసి ఇవ్వలేకపోయారని కాంగ్రెస్ ప్రభుత్వంలో సంవత్సరానికి 3500 చొప్పున అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేస్తున్నామని ఆ 640 డబుల్ బెడ్రూం ఇండ్లను కూడా త్వరలో పూర్తి చేసి లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు అందజేస్తామని నరేందర్ రెడ్డి అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు ప్రజలను మభ్య పెట్టేందుకు అక్కడక్కడ గుంతలు ఉన్న రోడ్లను కూడా తవ్వి పనులు ప్రారంభించినట్టు చూపించి ఓట్లు దండుకున్నారని అవన్నీ ఒకేసారి పూర్తి చేయాలని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారని నరేందర్ రెడ్డి ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి విషయంలో రాజీపడకుండా ముందుకు వెళుతుందని తప్పకుండా అవి కూడా పూర్తి చేయడానికి కృషి చేస్తుందని అన్నారు.
పాత మున్సిపల్ గెస్ట్ హౌజ్ ఏరియాలో నిర్మించిన బిల్డింగ్ పూర్తి చేయకపోవడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని పూర్తి చేయాలని ఆనాడు ఆందోళన చేస్తే ఆనాటి పాలకులు పట్టించుకోలేదని దాన్ని అందుబాటులోకి తేవడం కోసం 78 లక్షలతో త్వరలో పనులు ప్రారంభించబోతున్నామని నరేందర్ రెడ్డి తెలిపారు.
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన జేబులో ఇవ్వనప్పుడు సైకిళ్ల పంపిణీ మోదీ బర్త్ డే గిఫ్ట్ ఎలా అవుతుందని ఒకేసారి రెండు వేల సైకిళ్లు ఇవ్వడం వల్ల పిల్లలు ఆ సైకిళ్లు తీసుకెళ్లడానికి ఇబ్బందులు పడ్డారని సిక్ వాడి దగ్గర ఒక అబ్బాయి అదుపు తప్పి పడిపోవడం వల్ల ఆసుపత్రిలో చేర్పించి తల్లిదండ్రులు చికిత్స అందించారని నరేందర్ రెడ్డి తెలిపారు.
ఈ విలేఖరుల సమావేశంలో ఎండి తాజ్,కొరివి అరుణ్ కుమార్,శ్రవణ్ నాయక్,దన్న సింగ్,దండి రవీందర్,ఆస్తాపురం రమేష్,కుర్ర పోచయ్య,అనిల్ కుమార్,సుదర్శన్,జొన్నల రమేష్, మాసూమ్ ఖాన్,అంజయ్య,రాజ్ కుమార్ తదితరులుపాల్గొన్నారు.