13-01-2026 12:05:16 AM
మల్లన్న చెల్లెలు కొండపోచమ్మ దర్శనంతోనే పుణ్యం
రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తరలిరనున్న భక్తులు
జగదేవపూర్, జనవరి 12: జగదేవపూర్ మండల పరిధిలోని తీగుల్ నర్సాపూర్ గ్రామంలో నల్లరాతి గుట్టలో వెలిసి కోరిన కోరికలు తీర్చుతున్న తల్లి కొండపోచమ్మ క్షేత్రం ఉత్సవాలకు ముస్తాబయింది. కొండపోచమ్మ కొమురవెల్లి కోర మీసాల మల్లన్న స్వామికి స్వయానా చెల్లెలు అని ప్రతీక. కొన్ని వందల సంవత్సరాల పూర్వం కొండ పోచమ్మ తల్లి కొమురవెల్లిలోనే ఉండేదనీ, తన అన్న మల్లన్న స్వామి మీద కోపంతో తీగుల్ నర్సాపూర్ గ్రామంలోని దట్టమైన అడవిలోని నల్ల గుట్టల్లోకి వచ్చి స్థిరపడింది. అన్న మల్లనకు ఈ సమాచారం తెలిసిన వెంటనే మల్లన్న కొండపోచమ్మ దగ్గరకు వచ్చి తిరిగి కొమురవెల్లి రావాలని చెల్లిని బ్రతిమిలాడగా రాను అని చెల్లి పోచమ్మ మొండికేయగా ఎం వరం కావాలో కోరుకోమన్నాడు.
నీ దర్శనం కోసం వచ్చిన భక్తులు నా దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటేనే పుణ్యం ఉండేలా చెల్లి అడుగగా మల్లన్న స్వామి సరే అని చెల్లికి వరం ప్రసాదించినట్టు స్థానిక ప్రజలు చెబుతున్నారు. నాటి నుండి కొమురవెల్లి మల్లన్న దర్శనం అనంతరం భక్తులు కొండ పోచమ్మ కు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం అనవయితీగా వస్తుంది.
జాతరకు వేలాయే...
కోరిన కోరికలు తీర్చే కొండపోచమ్మ తల్లి జాతర ఉత్సవాలు ప్రతి సంవత్సరం జనవరి 14 వ తేదీ భోగి పండుగ రోజు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బైండ్ల పూజారులు వేసే సదరు పట్నంతో మొదలువుతాయి. నాటి నుండి మార్చి నెల ఉగాది పండుగ రోజు ఆలయ ప్రధాన అర్చకులు రమేష్, మల్లయ్య లు అమ్మవారికి నైవేద్యం, తీర్ధ ప్రసాదాలు సమర్పించడంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు.
ముస్తాబైన కొండపోచమ్మ....
నేటి నుండి ఉత్సవాలు ప్రారంభం అవుతుండడంతో ఆలయ గోపురంతో సహా ఆలయ ప్రాంగణంలో రంగులు వేసి దీపాల కాంతులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రవికుమార్ మాట్లాడుతూ అమ్మవారి ఆలయ ఉత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సైతం వచ్చి దర్శనం చేసుకుంటారన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఆలయ పరిసరాలలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
అమ్మవారి ఆలయ ప్రాంగణంలో తీర్థ ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం మెట్ల దగ్గర ధాత హైదరాబాద్ వాసి బోయిని సాయి యాదవ్ భక్తుల సౌకర్యార్థం రేకుల షెడ్లు నిర్మించడానికి ముందుకు వచ్చారని తెలిపారు. భక్తులకు ఎవరికైనా ఇబ్బంది కలిగినట్లయితే ఆలయ కార్యాలయంలో భక్తులకు అందుబాటులో సిబ్బంది కనకయ్య, మహేందర్ రెడ్డి లను సంప్రదించాలని సూచించారు.