13-10-2025 12:50:21 AM
-మట్టి రోడ్డుగా మారిన తారు రోడ్డు
-నిద్ర మత్తులో అర్‌ఆడ్‌బీ అధికారులు
-మండిపడుతున్న ప్రయాణికులు
అమీన్ పూర్, అక్టోబర్ 12 : కిష్టారెడ్డిపేట్ నుండి మాదారం రహదారి పొడవునా గుంతలు పడి, కంకర తేలి అధ్వాన్నంగా మారింది. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని జానకంపేట, బొమ్మల కుంట, వడక్పల్లి దారిలో వేసిన తారు రోడ్డు పూర్తిగా మట్టి రోడ్డుగా మారింది. ఈ దారిలో భారీ వాహనాలు, టిప్పర్లు రాకపోకలు సాగిస్తుండటంతో ఈ రోడ్డు మట్టి రోడ్డుగా మారడమే కాకుండా గుంతలు పడి, కంకర తేలి ప్రమాదకరంగా మారింది.
ఇటీవల రోడ్డు గుంతల మయం కావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తరుచూ రోడ్డు మీదుగా ప్రయా ణించే బైకర్లకు, స్కూల్ పిల్లలు వెళ్లాలంటే తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. సుల్తాన్‌పూర్ మెడికల్ డివైస్ పార్క్‌కు ఉపాధి కోసం మహిళలకు, కాలినడకన వేళ్లే బాటసారులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వాహనదారులు గుంత లు తప్పించడంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
ఈ రోడ్డు పూర్తిగా గుంతలమయం కావడంతో ఈ దారి మీదుగా ప్రయాణించాలంటే అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని వాహనాలు నడిపే దుస్థితి దాపురించింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ దారి మరింత దారుణం గా మారింది. వెంటనే సంబంధింత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ఈ రోడ్డును బాగు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.