calender_icon.png 28 October, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊరంతా పెయింటర్లే..!

26-10-2025 12:00:00 AM

రంగులేయడంలో ఆరితేరిన ఆదివాసీలు 

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మారుమూల కు గ్రామమైన జగన్నాయకులగూడెం పెయింటర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. 100 కుటుంబాలు, 500 కు పైగా జనాభా కలిగిన జగన్నాయకులగూడెం పూర్తిగా ఆదివాసీ తెగకు  చెందిన గ్రామ జనాభాలో ఉన్న పురుషుల్లో 50 మందికి పైగా పెయింటింగ్ రంగంలో స్థిరపడ్డారు. ఇందులో మరో విశేషం ఏమిటంటే యువకులంతా పూర్తిగా పెయింటర్ వృత్తిని ఎంచుకోవడం. 

50 మంది పెయింటింగ్ రంగం వైపు..

గ్రామంలో 30 మందికి పైగా యువకులు ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు చదువుకున్నప్పటికీ పెయింటర్ వృత్తి సాగిస్తున్నారు. మిగిలిన వారిలో కొందరు వ్యవసాయం, ఆ తర్వాత పెయింటింగ్ పనులకు వెళ్లడం అలవాటుగా చేసుకున్నారు. గ్రామానికి చెందిన రమేష్, సురేష్, శ్రీను తొలుత ఉపాధి  కోసం హైదరాబాదు నగరం బాట పట్టారు.

గృహాలకు రంగులు వేసే రోజువారీ కూలి పనులకు వెళ్లి క్రమక్రమంగా రంగులు వేయడంలో నైపుణ్యాన్ని సాధించారు. దీనితో రోజు భవన నిర్మాణ కూలీలకు చెల్లించే కూలికి రెట్టింపు కూలీ లభిస్తుండడంతో పెయింటింగ్ వృత్తిని ఎంచుకున్నారు. ఆ తర్వాత వీరి బాటలో గ్రామానికి చెందిన సుమారు 50 మంది వరకు యువకులు పెయింటింగ్ రంగం వైపు దృష్టి సారించారు.  

రోజుకు రూ.800 నుంచి 1,000

భవన నిర్మాణ పనికి వెళ్తే రోజుకు రూ.500  కూలీ లభిస్తుండగా అదే వీరికి పెయింటింగ్ రంగంలో రాణించడం వల్ల ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు అందుతున్నాయి. పెయింటింగ్ పనులు నిర్వహించడానికి జగన్నాయకుల గూడెం చెందిన యువకులంతా మహబూబాబాద్ జిల్లా పరిధితో పాటు వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ నగరాలకు వెళ్తున్నారు.

కొందరు గ్రామంలో ఉంటూ సీజన్లో వ్యవసాయ పనులు నిర్వహిస్తూ, ఇతర రోజుల్లో పరిసర ప్రాంతాల్లో పెయింటింగ్ పనులకు వెళ్తున్నారు. పెయింటింగ్ పనులతో తమకు నిత్యం ఉపాధి లభిస్తోందని, యువకులంతా ఈ రంగం పైనే ఆధారపడి జీవిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. అయితే, ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించి, నైపుణ్యాభివృద్ధి కల్పిస్తే ఆదివాసీ గిరిజన తెగలకు చెందిన యువకులు మరింత అభివృద్ధి సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

 బండి సంపత్ కుమార్, 

మహబూబాబాద్, విజయక్రాంతి

ప్రభుత్వం సహాయం అందించాలి

ఉపాధి కోసం పెయింటింగ్ పనులకు వెళ్తున్న యువతకు ప్రభుత్వం సహాయం అందించాలి. చదువుకొని పెయింటింగ్ రంగంలో స్థిరపడ్డ యువతకు శిక్షణ ఇప్పించి, ఆధునిక పరికరాలు అందించాలి. వీరిని సొసైటీగా ఏర్పాటు చేసి  ప్రభుత్వ భవన నిర్మాణ రంగంలో అవకాశాలు కల్పించాలి. మెరుగైన జీవనం కోసం ప్రభుత్వం చేయూతనందించాలి. 

 పెనుక విజయ్, పెయింటర్, జగన్నాయకుల గూడెం