02-11-2025 10:37:01 PM
రంగంలోకి దిగిన డాగ్స్ స్కాడ్ బృందం
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డి.ఎస్.పి, సీఐ
బెజ్జూర్ (విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని ఏలేశ్వరం జువెలర్స్ నగల దుకాణంలో చోరీ జరిగింది. షాప్ యజమాని నరేష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. షాపులో సుమారు 800 గ్రాముల వెండి సామాగ్రి చైన్లు తదితర వస్తువులు తీసుకెళ్లినట్లు వ్యాపారి తెలిపారు. వాటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని వారు పేర్కొన్నారు. దీనితో ఎస్సై సర్దాజ్ పాషా పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇట్టి విషయమై జిల్లా ఎస్పీ, డిఎస్పి, సిఐకి సమాచారం అందించినట్లు తెలిపారు. ముందుగా కౌటాల సిఐ సంతోష్ కుమార్ డాగ్ స్క్వాడ్ బృందంతో కలిసి దొంగ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
డాగ్ కుష్ఠపల్లి వెళ్లే మార్గంలో గిడ్డంగి వరకు వెళ్లి ఆగిపోయింది. మరోసారి డాగ్ ను బృందం పరిశీలించినప్పటికీ మళ్లీ అక్కడే ఆగిపోయింది. కాగజ్నగర్ డిఎస్పి చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ఎస్ఐని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దొంగని తప్పకుండా పట్టుకొని తీరుతామని షాప్ యజమానికి భరోసా ఇచ్చారు.క్లూటిమ్ బృందం సైతం షాపులో వేలిముద్రలు సేకరించారు. గత సంవత్సరం కూడా దీక్షిత ఫెర్టిలైజర్ దుకాణంలో చోరీలో రెండు లక్షల నగదు గుర్తు తెలియని దొంగ దోచుకెళ్ళాడు. ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు అని పలువురు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు దొంగలపై ప్రత్యేక నిఘా పెట్టి దొంగలను పట్టుకుని కఠినంగా శిక్షించాలని మండలంలోని వ్యాపారాలు కోరుతున్నారు. ప్రతి దుకాణం ముందు వ్యాపారులు సీసీ కెమెరాలు నాణ్యతతో కూడినవి ఏర్పాటు చేసేలా చూసుకోవాలని పోలీసులు కోరారు.