14-12-2024 01:22:24 AM
రాజకీయాలు వేరు.. రాష్ట్రాభివృద్ధి వేరు
హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): ‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది మాత్రమే పూర్తయింది. మేం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవెర్చేందుకు మరో నాలుగేళ్ల సమయముంది’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
తాము అధికారం లోకి వచ్చిన వెంటనే విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకొస్తానని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని, పదేళ్లు పూర్తయినా ఆయన హామీ నెరవేర్చలేదని గుర్తుచేశారు. ఇప్పుడు మూడోసారి కూడా కేంద్రంలో బీజేపీనే అధికారంలోకి వచ్చిందని, ఇప్పటికీ ఆ హామీ నెరవేరలేదన్నారు. పదేళ్లలో బీజేపీ రైతుల కోసం చేసిందేమీ లేదని విమర్శించారు.
పైగా రైతులకు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చిందన్నారు. అందుకు నిరసనగా ఆందోళన చేపట్టిన రైతులపై సర్కారు ఉక్కుపాదం మోపి అణిచివేసిందన్నారు. నాడు ఓ కేంద్ర మంత్రి కుమారుడు రైతుల పైకి కారును ఎక్కించాడని వాపోయారు.
కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదని, అధికారంలోకి వచ్చిన కొద్దినెలల్లోనే రైతులకు సంబంధించిన రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసిందని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా 115 కోట్ల మంది మహిళలు బస్సులో ఉచిత ప్రయాణం చేశారన్నారు. ఉచిత బస్సు సేవలతో మెట్రోలో ఎంతమంది ప్రయాణికులు తగ్గిపోయారో తేలాల్సి ఉందని చమత్కరించారు.
బీజేపీ ఎన్ని ఉద్యోగాలిచ్చింది ?
బీజేపీ అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల చొప్పున యువతకు ఉద్యోగాలిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారని, గడిచిన 11 ఏండ్లలో యువతకు ఎన్నికోట్ల ఉద్యోగాలిచ్చారో లెక్కచెప్పాల్సిన అవసరం ఉందని సీఎం డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సుమారు 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని స్పష్టం చేశారు.
విద్యార్థుల కోసం 40 శాతం మెస్ ఛార్జీలు పెంచామని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. తమ ప్రభుత్వం ఒక్కో హామీని నెరవేరుస్తూ వస్తుందన్నారు. ధనిక రాష్ట్రాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా చేసిందని, అయినా ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు. ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిస్తున్నామన్నారు.
మెట్రో రైలు సేవలను శంషాబాద్ వరకు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మూసీ సుందరీకరణ చేసి తీరుతామని తేల్చిచెప్పారు. రాజకీయాలు వేరు, రాష్ట్ర అభివృద్ధి వేరని, రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినా తాము ఆహ్వానిస్తామని కుండబద్దలు కొట్టారు.
సాధారణ మహిళలా తెలంగాణ తల్లి విగ్రహం..
సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం సగటు తెలంగాణ మహిళలా ఉందని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విగ్రహం సంపన్నవర్గానికి చెందిన మహిళలా ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. విగ్రహంలో ఆశీర్వదిస్తున్నట్లు ఉన్న చేయిని, కొందరు హస్తం పార్టీ గుర్తు అంటున్నారని.. అది వాస్తవం కాదని తేల్చిచెప్పారు. ఆ చేయి అమ్మ ఆశీర్వాదం, దేవుళ్ల ఆశీర్వాదంలాగానే చేతిని చూడాలని కోరారు.
అల్లు అర్జున్ బార్డర్‌లో యుద్ధం చేశారా?
సినీ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై మీడియా సీఎంను ప్రశ్నించగా.. ‘సాధారణ పౌరుడి నుంచి ప్రధాని వరకూ రాజ్యాంగం అందరికీ సమానంగా వర్తిస్తుంది. చట్టం తన పని తాను చేసుకుం టూ పోతుంది. అందులో మా జోక్యం అవసరం లేదు. చట్టం ముందు అందరూ సమానులే. ప్రత్యేకంగా మాట్లాడటానికి అల్లు అర్జున్ భారత్ పాక్ యుద్ధం చేసి వచ్చారా? బెనిఫిట్ షోకే కాక ఇతర షోలకూ టికెట్ ధరలు పెంచుకోవడానికి మేం అనుమతి ఇచ్చాం.
పుష్ప విడుదల రోజు సంధ్య థియేటర్‌లో ఓ మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రాపాణం పోయినా కేసు పెట్టొద్దా ? ఒకవేళ కుమారుడు కోమా నుంచి బయటకు వచ్చి.. అమ్మేది..? అంటే ఏం చెప్తాం ? ముందస్తు అనుమతి లేకుం డా అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చారు. సినిమా చూసి బయటకు వచ్చిన ఆయన సైలెంట్‌గా వెళ్తే ఏ సమస్య ఉండేది కాదు.
కారు నుంచి బయటకు వచ్చి హడావుడి చేయడంతోనే తోపులాట జరిగింది. సినిమా హీరోది వ్యాపారం. నిర్మాతలు డబ్బులు పెట్టారు. వసూలు చేసుకుంటున్నారు. ఫిలీం స్టార్, పొలిటికల్ లీడర్ల కోసమని ప్రత్యేక చట్టాలేమీ ఉండవు. అల్లు అర్జున్ మేనమామ చిరంజీవి, పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్‌రెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ నేతలే. అల్లు అర్జున్ భార్య కుటుంబం మాకు బంధువులే. హోంశాఖ నా వద్ద ఉంది.
కేసుకు సంబంధించిన రిపోర్ట్ నాకు పూర్తిగా తెలుసు’ అని వెల్లడించారు. పోలీసులు చట్టప్రకారమే సంధ్య థియేటర్ మేనేజ్‌మెంట్‌పై కేసులు పెట్టారని, కేసుకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేశారని సీఎం వివరించారు. కావాలని ఫిలీం స్టార్‌ను అరెస్టు చేశారనేది శుద్ధ అబద్ధమని కుండబద్ధలు కొట్టారు.
మహిళ మృతికేసులో అల్లు అర్జున్ ఏ11 నిందితుడని, ఆయన సినిమా చూడాల కుంటే స్టూడియోలో స్పెషల్ షో వేసుకుని చూస్తే సరిపోయేదన్నారు. ప్రేక్షకులు, అభిమానులతో కలిసి చూడాలనుకుంటే మందుగా పోలీసులకు సమాచారం ఇస్తే బాగుండేదన్నారు.
లేదంటే కనీసం థియేటర్ మేనేజ్‌మెంట్‌కైనా సమాచారం ఇస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. అకస్మాత్తుగా థియేటర్‌కు వచ్చేస్తే, థియేటర్ యాజమాన్యమైనా ఏం చేస్తుందని ప్రశ్నించారు.
మంత్రివర్గ విస్తరణపై చర్చే లేదు..
సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): మంత్రి వర్గ విస్తరణపై ఢిల్లీలో చర్చే జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... ఏఐసీసీ పెద్దలతో జరిగిన భేటీలో ఈ అంశంపై చర్చే జరగలేదన్నారు. కేబినెట్ విస్తరణపై పీసీసీ చీఫ్, డిఫ్యూటీ సీఎంతో పాటు పలువురు ముఖ్యనేతలతో చర్చలు జరగాల్సి ఉందన్నారు.
వారు లేకుండా చర్చలు ఎలా సాగుతాయని ఆయన బదులు ప్రశ్న సంధించారు. కాగా, సీఎం శనివారం కోకాపేటలో కురుమ ఆత్మగౌరవ (కురుమ విద్యార్థి వసతి గృహ ట్రస్ట్) భవనాన్ని ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ముఖ్యఅతిథులుగా హాజరు కానున్నారు.