31-10-2025 01:31:45 AM
 
							-రెండు నెలలుగా రూ.10వేల పరిహారం కోసం అన్నదాతల ఎదురుచూపులు
-ఖరీఫ్ నష్ట పరిహారం రబీకి అందేనా...?
- పంట పెట్టుబడికి పైసలు లేక దిక్కుతోచని స్థితిలో రైతన్నలు
ఆదిలాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి) : జిల్లాలో గత రెండు నెలల క్రితం కురిసిన అకాల భారీ వర్షాలు అన్నదాతలను ఆగమాగం చేశాయి. మరికొన్ని రోజుల్లో చేతికి అందుతది అనుకున్న పంట నీట మునగడంతో రైతన్నల కష్టం నీటిపాలైంది. పంట కోసం వెచ్చించిన పెట్టుబడి మొత్తం కన్నీటిపాలైంది. జిల్లాలో వరద తీవ్రతకు పంటలు నీట మునగడం... కొన్ని చోట్ల పంట పొలాలు కోతకు గురికావడం.. మరికొన్ని చోట్ల రోజుల తరబడి నీళ్లలోనే పంట ఉండటంతో ఎందుకు పనికి రాకుండా పోయాయి.
కొత్తగా పంటలు వేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఈ దశలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలు ఆదుకుంటామని భరోసా ఇచ్చింది. ఎకరానికి రూ. 10వేల చొప్పున నష్ట పరిహారం అందిస్తామని హామీ ఇచ్చింది. జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం పంటలను పరిశీలించి రైతులకు దైర్యం చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేసి పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపించారు. కానీ రెండు నెలలు గడుస్తున్నా పంట పరిహారం పత్తా లేదు... ప్రభుత్వ హామీ నెరవేరలేదు. దీంతో అన్నదాతలు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక రబీ పంటలు కూడా వేయలేని దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.
18,310 ఎకరాల్లో నష్టం...
ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది ఆగస్టు నెలలో భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలో కురిసిన వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురి సిన వర్షాలతో నదులు, వాగులు ఉగ్రరూపం దాల్చాయి. సరిహద్దుల్లో ఉన్న పంట పొలాల ను ముంచేత్తాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రవహిస్తున్న పెన్ గంగా నది ఉదృతంగా ప్రవహించడంతో సరిహద్దులోని బేలా, జైనథ్, భోరజ్, భీంపూర్, తాంసి మండల్లాలతో పాటు పలు వాగుల సమీపంలో ఉన్న సరిహద్దు గ్రామాల్లోని పంట పొలాలు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో పంటలన్నీ వర్షార్పణమయ్యాయి.
పత్తి, సోయా, మొక్కజొన్న, జొన్న తదితర పంటలు వరద తీవ్రతకు గురయ్యా యి. స్పందించిన ప్రభుత్వం పంట నష్టం సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే చేసి జిల్లాలో 18,310ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వానికి నివేదిక అందించింది. జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం రైతులను పరామర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎకరానికి రూ. 10వేల చొప్పున పరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు. కానీ రెండు నెలలు గడుస్తున్నా పరిహారం పత్తాలేకుండా పోయింది. పంటలు కోల్పోయిన రైతులు ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
పంట కోసం పైసలు లేక పరేషాన్..
ఖరీఫ్‌లో అధిక వర్షాల కారణంగా పంట లు నష్టపోయిన రైతులు రబీ సీజన్‌లో ఆ లోటును కొంతైనా పూడ్చుకోవాలని భావిస్తున్నారు. తాజాగా రబీ సీజన్ ప్రారంభం కావడంతో శనగ, జొన్న తదితర పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ప్రభు త్వం నుంచి పంట నష్టపరిహారం రాక.. ఎకరానికి రూ.6వేల చొప్పున అందించాల్సిన రైతు భరోసా నిధులు సైతం ఖాతాల్లో జమ కాకపోవడంతో అన్నదాతలు ఆర్థిక కష్టాలు అనుభవి స్తున్నారు. చేతిలో డబ్బులేక పంటలు వేయలేని పరిస్థితిలో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఖరీఫ్ పంట కోసం తీసుకొచ్చిన అప్పు తీర్చలేని పరిస్థితి ఉండటంతో.. కొత్తగా అప్పు కూడా దొరకని పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం నష్టపరిహారం డబ్బులను ఖాతాల్లో జమ చేస్తే రైతులకు కొంత వరకైనా ఊరట లభించేందుకు ఆస్కారం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పరిహారం అందించి ఆదుకోవాలి...
ఖరీఫ్‌లో వేసిన పత్తి పంట అధిక వర్షాలకు నీటమునిగింది. కళ్ళముం దే చేతికొచ్చిన పంట వరదలకు కొట్టుకుపోయింది. నాకు ఉన్న 6 ఎకరాల్లో పత్తి పంట వేస్తె వర్షాలకు పూర్తిగా నష్టం వాటిల్లింది. అధికారులు సర్వే సైతం చేశారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా నష్ట పరిహారం రావడం లేదు. త్వరగా నష్టపరిహారం అందిస్తే రబీసాగు కొంత ఆసరాగా ఉంటుంది. అకాల వర్షాలు రైతులను పూర్తిగా నట్టేట ముంచాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలి.
కుమ్ర జ్ఞానేశ్వర్, రైతు పూనా గూడ, తలమడుగు మండలం