17-05-2025 11:22:24 PM
జిల్లా వైద్యాధికారి గాయత్రీ దేవి..
సిర్గాపూర్: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని రూప్లా నాయక్ తాండాలో చికెన్ గున్యా కలకలం పేరుతో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి శనివారం స్పందించారు. తండాను సందర్శించిన ఆమె అక్కడి ప్రజలు ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. తాండాలో ప్రస్తుతం చికెన్ గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులు ఏవీ నమోదు కాలేదని స్పష్టం చేశారు. ఒక కుటుంబంలో ఒక్కరికి వైరల్ ఫీవర్ వచ్చిన కారణంగా ఇంటి సభ్యులకు జ్వరం వచ్చింది కానీ అది పెద్దగా ఆందోళన కలిగించాల్సిన అంశం కాదన్నారు. ఆరోగ్యశాఖ ఇప్పటికే గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తోందని, కొంతమంది రక్త నమూనాలు తాండాలోని నీటి నమూనాలను ల్యాబ్‌కు పరీక్ష కోసం పంపినట్లు తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్యశాఖను సంప్రదించాలన్నారు. ఈ సందర్శనలో వైద్యాధికారులు భాస్కర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.