06-07-2025 12:00:00 AM
మనసుపెట్టి ఆలోచించాలేకానీ కొన్ని సమస్యలకు.. కంటి ముందే పరిష్కారం కనిపిస్తుంది. ఇథియోపియాలో తాగునీటికోసం అల్లాడిపోతున్న ప్రజలను చూసి వాళ్లకు ఏదైనా సాయం చేద్దామనుకున్న ఇటాలియన్ ఆర్కిటెక్ట్ విట్టోరీకి.. ఇలానే ఒక పరిష్కారం దొరికింది. ‘గుక్కెడు నీళ్లకోసం జనాలు ఎన్నో మైళ్ల దూరం ప్రయాణిస్తున్నారు. కానీ కొన్ని చెట్లూ, కీటకాలూ మాత్రం నీటికొరత లేకుండా ఎలా బతుకుతున్నాయి? అని ఆలోచించిన విట్టోరీని వెదురు చెట్లు గాల్లోని తేమను ఒడిసిపట్టి నీళ్లు దాచుకునే తీరు ఆకర్షించింది. ఆ చెట్లనే స్ఫూర్తిగా తీసుకుని వెదురుతో పొడవాటి టవర్లని నిర్మించడం మొదలుపెట్టాడు.
ఆ టవర్లలోని సన్నటి మెష్‌లు.. గాల్లోని తేమని గ్రహించి, దాన్ని మంచినీటిగా మారుస్తున్నాయి. టవర్ కింద ఉన్న కుళాయి తిప్పితే నీళ్లు వస్తాయి. ఈ టవర్లు రోజుకి ౧౦౦ నుంచి 150 లీటర్ల వరకూ మంచి నీటిని అందిస్తున్నాయి.
ఈ ప్రాజెక్ట్ విజయవంతం అవ్వడంతో విట్టోరీ ‘వర్కావాటర్’ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి, మనదేశం సహా 15 దేశాల్లో ఈ వెదురు టవర్లని నిర్మించాడు. స్థానికులకు శిక్షణ ఇచ్చి వాళ్లంతటవాళ్లే ఈ టవర్లు నిర్మించుకునేలా చేస్తున్నాడు. మన పల్లెల్లో ప్రజలు రావి చెట్టుకింద కూర్చుని ఎలా మాట్లాడుకుంటారో, ఇథియోపియాలో వర్కా చెట్టు కింద కూర్చుని అలా మాట్లాడుకుంటారట. వర్కావాటర్‌కి ఆ పేరు.. ఈ చెట్టు నుంచి వచ్చిందే!