calender_icon.png 27 August, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైమాలో సందడి చేసే సెలబ్రిటీలు వీళ్లే

27-08-2025 01:58:10 AM

దక్షిణాదిన ప్రతిష్టాత్మక వేడుకగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ఈ ఏడాది వేడుకలు దుబాయ్‌లో జరగనున్నాయి. అక్కడి ఎక్స్‌పో సిటీ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి. ఏడాదికోసారి సౌత్ సినిమాను ప్రపంచానికి పరిచయం చేస్తూ వస్తున్న ఏకైక అవార్డ్స్ ప్లాట్‌ఫారమ్‌గా గుర్తింపు తెచ్చుకున్న సైమా 13వ ఎడిషన్ ఈ ఏడాది వేడుక మరింత భారీ స్థాయిలో నిర్వహించనున్నారు.

సెప్టెంబర్ 5న తెలుగు, కన్నడ అవార్డ్స్ నైట్ ఉంటుంది. సెప్టెంబర్ 6న తమిళ, మలయాళ అవార్డ్స్ నైట్ నిర్వహిస్తారు. స్టార్ హీరోలు, టెక్నీషియన్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఒకే వేదికపై కలుసుకోబోతున్నారు. ఈ వేడుకకు హాజరయ్యే స్టార్ సెలబ్రిటీల వివరాలను సైమా చైర్‌పర్సన్ బ్రిందా ప్రసాద్ మంగళవారం వెల్లడించారు.

కమల్‌హాసన్, అల్లు అర్జున్, శివకార్తికేయన్, పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్, కార్తి, రష్మిక మందన్న, త్రిష, ఉన్ని ముకుందన్, ఉపేంద్ర, దునియా విజయ్, మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్, పర్వతి తిరువోథు, తేజ సజ్జా వంటి ఎంతో మంది స్టార్లు, టెక్నీషియన్లు పాల్గొంటారు. ఇంకా ఈ వేదికపై శ్రుతిహాసన్, శ్రియా శరణ్, వేదిక, శిల్పారావు, ఉర్వవీ రౌతేలా, సానియా అయ్యప్పన్, అమృత అయ్యంగార్‌తోపాటు బీ యూనిక్ క్రూ డాన్స్ ట్రూప్.. గ్లామర్, మ్యూజిక్, డాన్స్ వంటి ప్రదర్శనలతో అలరిస్తారు.

ఈ ఏడాది స్టేజ్‌పై ప్రదర్శన ఇవ్వబోతున్న శ్రుతిహాసన్ మాట్లాడుతూ.. “సైమా నాకు ఎప్పుడూ చాలా ప్రత్యేకం. ఇది కేవలం అవార్డ్స్ ఫంక్షన్ కాదు, సినిమా పండుగ. మనందరం ఒక కుటుంబంలా కలిసి సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్. దుబాయ్‌లో తిరిగి ఫ్యాన్స్ ముందుకు రావడం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఈ జర్నీ మరింత మ్యాజికల్‌గా ఉంటుంది” అని తెలిపింది.