29-06-2025 12:00:00 AM
మనం రోజువారీగా వాడే కొన్ని వస్తువులు అనారోగ్య సమస్యలకు మూలంగా మారతాయని మనం గ్రహించం. టూత్‌బ్రష్‌లు, ఆల్కహాల్ ఉన్న యాంటి మైక్రోబియల్ మౌత్‌వాష్‌లు, మొద్దుబారిన రేజర్లు మనకు తెలియకుండానే ఆరోగ్యానికి చేటుచేస్తాయి. కాబట్టి వీటి వాడకం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అరిగిపోయిన టూత్‌బ్రష్ పాత టూత్‌బ్రష్ వాడకం వల్ల నోటి ఆరోగ్యం పాడైపోతుంది. అరిగిపోయిన బ్రిసిల్స్ ఉన్న టూత్‌బ్రష్‌లు పళ్ల మీద పాచిని పూర్తిగా తొలగించలేవు. దాంతో నోట్లో పాచి పెరిగిపోతుంది. చిగుళ్ల సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి మూడు నెలల కాలం ముగిసేవరకు వేచి చూడకుండా బ్రిసిల్స్ అరిగిపోవడం మొదలుకాగానే టూత్‌బ్రష్ మార్చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే 75 శాతం మంది మాత్రం మూడు నెలలు దాటినా కూడా బ్రష్‌ను అలాగే ఉంచేస్తున్నారట. ఇది మంచిది కాదు. అరిగిపోయిన బ్రష్‌లు పళ్లను 30 శాతం తక్కువ శుభ్రం చేస్తాయి. పైగా వీటిపై ప్రమాదకరమైన సూక్ష్మజీవులు పేరుకుని ఉంటాయి. అందువల్ల మూడు నెలల కాలం పరిమితి మాత్రమే కాకుండా బ్రష్ అరిగిపోవడాన్ని కూడా గమనించాలి.
మౌత్‌వాష్‌లు..
ఆల్కహాల్ ఉన్న యాంటి మైక్రోబియల్ మౌత్‌వాష్‌లను (క్లోర్‌హెక్సిడిన్ లాంటివి) క్రమం తప్పకుండా వాడుతుంటే.. నోట్లో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతింటుంది. డిస్‌బయోసిస్‌ను సృష్టిస్తుంది. చిగుళ్ల వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు సంబంధించిన ప్రమాదకరమైన సూక్ష్మక్రిముల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతేకాదు జంతువులపై జరిగిన అధ్యయనంలో..
ఆల్కహాల్ ఉన్న యాంటి మైక్రోబియల్ మౌత్‌వాష్‌లు రెగ్యులర్‌గా వాడుతుంటే పొట్టలో ఉన్న బ్యాక్టీరియా కూడా మారిపోతుందని తేలింది. ఇవి జీవక్రియలను ప్రభావితం చేస్తాయి. పోషకాలు తీసుకునే మొత్తాన్ని తగ్గిస్తాయి. కాబట్టి యాంటిమైక్రోబియల్ మౌత్‌వాష్‌ను ప్రత్యేకమైన దంత సంరక్షణలోనే వాడాలే తప్ప, రోజువారీ అవసరాల కోసం వాడొద్దని దంత వైద్యుల సూచన.
రేజర్లు
మొద్దుబారిన రేజర్లు మన చర్మానికి హానిచేస్తాయి. 2020 సంవత్సరం నాటి ఓ అధ్యయనం ప్రకారం మన వెంట్రుకలు పదునుగా ఉన్న రేజర్లలో కూడా చిన్నచిన్న పగుళ్లు వచ్చేలా చేస్తాయట. అలా వాటిని తొందరగా మొద్దుబారేలా చేస్తాయి. దీంతో రేజర్లకు వెంట్రుకల్ని కత్తిరించే సామర్థ్యం తగ్గుతుంది. పట్టేసినట్టుగా జరగడానికి (టగ్గింగ్) కారణమవుతుంది. చర్మం మంటగా ఉంటుంది.
చిన్నచిన్న గాట్లు కూడా పడతాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకూ దారితీస్తుంది. కాబట్టి.. రోజూ షేవింగ్ చేసుకునే వాళ్లు తమ షేవింగ్ సాఫీగా సాగిపోవాలంటస్త్ర రేజర్‌ను ప్రతి ఐదు నుంచి ఏడు షేవ్‌లకు ఓసారి మార్చాలి. లేదంటే అది లాగుతున్నట్లుగా అనిపించినా మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు.