19-09-2025 12:00:00 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): కాంగ్రెస్ పాలనలో మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఢిల్లీలో ఉన్న బడే భాయ్‌ను సంతృప్తి పరచడానికి చోటా భాయ్ రేవంత్ రెడ్డి మైనారిటీల గొంతు కోస్తున్నారని బీఆర్‌ఎస్ మైనార్టీ నాయకులు ఇంతియాజ్ అహ్మద్, మషియుల్లా ఖాన్ విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ... 22 నెలల రేవంత్ పాలనలో మైనారిటీలకు కొత్తగా ఏమీ చేయక పోగా కేసీఆర్ తెచ్చిన పథకాల్లో కోత పెడుతున్నారని ఆరోపించారు.
మైనారిటీ గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల్లో కోత పెడుతున్నారని మండిపడ్డారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు తగ్గించేలా తెచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ మైనారిటీ సంక్షేమ విద్యా సంస్థ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి మైనార్టీల పట్ల చిన్న చూపు చూస్తున్నారని, మైనారిటీ గురుకులాలను మూసి వేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు.