calender_icon.png 19 September, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా బస్తా.. రైతన్నకు తప్పని అవస్థ

19-09-2025 12:00:00 AM

  1. నెలరోజులు గడుస్తున్న తుంగతుర్తిలో తీరని యూరియా కష్టాలు
  2. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సొసైటీ ముందే తిష్ట
  3. గంటలకొద్దీ నిలబడ్డ అందేది గగనమే..
  4. తుంగతుర్తి సొసైటీకి అధిక యూరియా పంపాలని రైతుల డిమాండ్

తుంగతుర్తి, సెప్టెంబర్ 18 :  ప్రభుత్వం రైతులకు యూరియా పంపిణీ చేయడంలో పూర్తిగా విఫలమైందని ఒక ఒక ప్రక్క ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు, మరొక ప్రక్క రైతులు గొంతెత్తి చెబుతున్నారు. జిల్లాలోని తుంగతుర్తి మండల కేంద్రంలో గల రైతు సహకార సంఘం వద్ద గడిచిన నెల రోజులుగా అడపాదడపా వస్తుంది.  వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసు బందోబస్తు మధ్య ముందస్తుగా ఆధార్ కార్డు, భూమి పాసుబుక్ ఉన్నవారికి ఒక్కటి, రెండు చొప్పున ప్రారంభంలో పంపిణీ చేశారు. అయితే ప్రతిరోజు వచ్చిన వారే వచ్చి యూరియా బస్తాలను దండుకుని కొంత కృత్రిమ కొరత సృష్టించారు.

దీంతో యూరియా బస్తా కోసం రైతులకు అవస్థలు తప్పడం లేదు. ఒకటి రెండు ప్రైవేటు దుకాణాలకు యూరియా రాగా, వారు యూరియాతో ఇతర మందులను ముడిపెట్టి, ధరను పెంచి పలుకుబడి గల వ్యక్తులకు ఐదు బస్తాల చొప్పున  అందజేశారనీ పలువురు రైతుల ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా సొసైటీలలో కొంతమంది డైరెక్టర్లు 10 బస్తాలు కూడా, రైతులకు ఇప్పించినారని విమర్శలు వచ్చాయి.

దీంతో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు సమన్వయంతో  ఆధార్ కార్డు, భూమి పాసుబుక్ ఉన్నవారికి ఆరోజు అందుబాటులో ఉన్న యూరియా కట్టలను బట్టి ఒకటి లేదా రెండు చొప్పున పంపిణీ చేస్తున్నారు. రైతులందరి పొలాలకు ఒకేసారి యూరియా అవసర రావడంతో ప్రస్తుతం యూరియా దొరకడం అత్యంత కష్టంగా మారింది. ఇదిలా ఉండగా కొంతమంది గ్రామస్తులు మాత్రం కావాలని, లైన్లో నిలబడి యూరియా తీసుకుంటూ, అధిక ధరలకు ఇతరులకు అమ్ముతున్నట్లు తెలుస్తుంది.

ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టమొచ్చిన రేటుకు ఇష్టం వచ్చినట్లుగా అమ్ముకుంటున్న స్థానిక ఏ డి ఏ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ రైతుల నుంచి విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. యూరియా కోసం రైతును పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకొని జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ తుంగతుర్తి నియోజకవర్గంలోని పిఎసిఎస్ లకు ఎక్కువ యూరియా పంపి ఇబ్బందులు తొలగించాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.