29-10-2025 12:00:00 AM
-సమస్యల నడుమ సహవాసం..
-నెలలు గడుస్తున్న కానరానీ కరెంటు
-కాలకృత్యాలకు పబ్లిక్ టాయిలెట్సే దిక్కు
-చీకట్లో బాలసముద్రం డబుల్ బెడ్ రూమ్ వాసులు
హన్మకొండ, అక్టోబర్ 28 (విజయ క్రాంతి) : హనుమకొండ నడిబొడ్డున గల బాలసముద్రంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివాసం ఉంటున్న ప్రజలు కనీస వసతులు కరువై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఏడాది ఆగస్ట్ 8న లబ్ధిదారులకు ఇండ్లను రెవెన్యూ శాఖ, వరంగల్ జిల్లా ఇన్ చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఆ సమీపంలోనే గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వారు కొత్తగా నిర్మించిన ఈ ఇండ్లలోకి తమ నివాసాన్ని మార్చుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ డబుల్ బెడ్ రూమ్ కాలనీ లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.
దీంతో ఇంతకాలం గుడిసెల్లో నివసించిన నిరుపేదల సొంత ఇంటి కల నెరవేరినప్పటికీ డబుల్ బెడ్ రూమ్ కాలనిలో కనీస వసతులు లేకపోవడం గమనార్హం. నల్లా నీళ్లు రాకపోవడంతో వాటర్ ట్యాంకర్ల ద్వారా జీ డబ్ల్యూ ఎం సీ అధికారులు నామమాత్రంగా నీటిని సరఫరా చేస్తున్నారు. అదికూడా వారానికి రెండు సార్లు మాత్రమే ట్యాంకర్లు వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. సరిపడా నీళ్లు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కనీసం విద్యుత్, నల్లా, డ్రైనేజి వ్యవస్థ సరిగా లేకపోవడంతో వారు చెప్పలేని బాధలు పడుతున్నారు. టాయిలెట్స్ కు నీటి వసతి లేకపోవడం, పలు పైప్ లైన్లు పాడవడంతో వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. కనీసం ప్రతిరోజూ కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు.
పలువురు బంధువుల ఇండ్లను ఆశ్రయిస్తుండగా మరి కొందరు పబ్లిక్ టాయిలెట్స్ ను ఆశ్రయిస్తున్నారు. ఇంకొందరు బహిర్భుమికి ఆరుబయటకు వెళుతున్నారు. దిక్కు తోచని స్థితిలో డబుల్ బెడ్ రూమ్ వాసులు సమస్యల మధ్యే సహవాసం చేస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ లను పంపిణీ చేసే సమయంలో నెల రోజుల్లో అక్కడ అన్ని వసతులు కల్పిస్తామని స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ మూడు నెలలు కావస్తున్నా కనీస వసతులు లేకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పదేళ్ల క్రితం నుంచి గుడిసెల్లో నివాసం ఉంటున్న పేదలకు స్థానిక ఎమ్మెల్యే చొరవతో ఇండ్లు పంపిణీ చేశారు. కానీ వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
ఎమ్మెల్యే, కమిషనర్ ఆదేశించినా..
హనుమకొండ బాలసముద్రం అంబేద్కర్ నగర్, జితేందర్ సింగ్ నగర్ వద్ద గుడిసె వాసులకు గత ప్రభుత్వం హయాం లో 592 ఇండ్లను కట్టించారు. నిర్మాణం పూర్తునప్పటికీ దాదాపు 7 ఏండ్ల పాటు పంపిణీ చేయకుండానే ఉన్నాయి. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి చొరవతో ఈ ఏడాది ఆగస్ట్ లో పేదలకు పంపిణీ చేశారు. స్థానికంగా ఉన్న గుడిసెలను సైతం తొలగించారు. దీంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి పేదలు మకాం మార్చారు. వసతులు లేకపోవడంతో కొందరు ఇంకా డబుల్ బెడ్ రూమ్ లలోకి మారలేదు. కాగా లబ్దిదారులకు ఇండ్ల పంపిణీ సందర్భంగా ఆగస్ట్ మొదటి వారంలో స్థానిక ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్ తదితరులు అక్కడ వసతులను పరిశీలించారు.
వసతులను కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా ఇండ్ల నిర్మాణం సందర్భంగా గతంలో కాంట్రాక్టర్ డబుల్ బెడ్ రూమ్ కాలనిలో పనులు పూర్తి చేశారు. ఏండ్ల తరబడి నిరుపయోగంగా ఉండటంతో కొన్ని వసతులు పాడయ్యాయి. ఇండ్లు పంపిణీ చేశాక కూడా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పర్యటించారు. వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కానీ ప్రస్తుతం కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో, అధికారుల అలసత్వమో తెలియదు కానీ పనులు జరుగటంలేదని స్థానికులు వాపోతున్నారు.
కనీస వసతులు కల్పించాలి
అంబేద్కర్ నగర్, జితేందర్ సింగ్ లోని పేదల డబుల్ బెడ్ రూమ్ కలను ప్రభుత్వం, ఎమ్మెల్యే సాకారం చేశారు. కానీ ఇండ్లను పంపిణీ చేశాక అక్కడ మౌలిక సదుపాయాలు కరువై ఆ కాలనీ వాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఎమ్మెల్యే, జీ డబ్ల్యూ ఎం సీ అధికారులు వెంటనే స్పందించి డబుల్ బెడ్ రూం వాసులకు అవసరమైన త్రాగునీరు, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలి.
- ఓరుగంటి స్వామి, అంబేద్కర్ డబుల్ బెడ్ రూం సంఘం అధ్యక్షుడు
విద్యుత్, డ్రైనేజీ సౌకర్యాన్ని కల్పించాలి
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంజూరు చేసిన తర్వాత ప్రభుత్వ అధికారులు త్వరలోనే విద్యుత్తు, నీటి సరఫరా చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఏ విధమైనటువంటి ముందడుగు వేయలేదు. దయచేసి అధికారులు స్పందించి కరెంటు సౌకర్యం నీటి వసతులను కల్పించాలని వేడుకుంటున్నాము. డ్రైనేజీ సౌకర్యం సరిగా లేకపోవడం వల్ల మరుగుదొడ్లు ఉపయోగించలేకపోతున్నాం కావున వెంటనే అధికారుల స్పందించి డ్రైనేజీ సౌకర్యాన్ని కల్పించాలని వేడుకుంటున్నాం.
- గుగులోతు శ్రీనివాస్, అంబేద్కర్ డబుల్ బెడ్ రూం సంఘం ప్రధాన కార్యదర్శి