calender_icon.png 3 November, 2025 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంకర పరిచారు..తారు మరిచారు

03-11-2025 12:27:00 AM

  1.  ఏండ్లు గడిచినా ముందుకు సాగని పనులు                       
  2. మండల కేంద్రం నుండి లింగంపల్లి క్రాస్ రోడ్ వరకు సవ్యంగా సాగని పయనం              
  3. ప్రయాణానికి అవస్థలు పడుతున్న వాహనదారులు 
  4. వాహనాల రద్దీ వలన పైకి లేస్తున్న కంకర పొడితో పంటలపై ప్రభావం
  5. తారువేసి బాధలు తీర్చాలంటున్న ప్రజలు 

నూతనకల్, నవంబర్ 2 : ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఏ ప్రభుత్వమైనా రోడ్డు మార్గాలను ఏర్పాటు చేస్తుంది. అయితే కొందరు అధికారుల అలసత్వంతో రవాణా సౌకర్యాలు సక్రమంగా లేక ప్రయాణానికి ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ఇదే పరిస్థితి నూతనకల్ మండలంలో ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గత ప్రభుత్వ హయాంలో నూతనకల్ మండల కేంద్రం నుండి లింగంపల్లి క్రాస్ రోడ్ వరకు తారు రోడ్డు  ఏర్పాటు కోసం రూ.3 కోట్లు మంజూరు కాగా 2023 మే నెలలో రహదారి ఆధునికరణకు పనులు ప్రారంభించారు.

తదుపరి ప్రభుత్వం మారడంతో పనులు అలాగే నిలిచిపోయాయి. గుత్తేదారి కంకర పోసి  తారు రోడ్డును వేయడం నిలిపి వేశారు. పనులు వదిలేసి రెండేళ్లు గడుస్తున్నా ఎవరు పట్టించుకోవడంలేదు. దీనితో రోడ్డుపై పోసిన కంకర, రాక్ పవర్ వాహనాల రద్దీకి గాలికి లేచిపోయి పక్కనే ఉన్న పంట పొలాలు వరి, మిర్చి, పత్తి పంటలపై పడుతోంది. దీని ప్రభావంతో పంట మొక్కలు ఎదుగుదల సక్రమంగా జరుగలేదని రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇక పంట చేతికందే దశలో పంట నాణ్యత పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటూ రైతులు చెబుతున్నారు. ఈ మార్గంలో ప్రయాణించాలంటే వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి.  ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై తారు పొయించి ప్రయాణానికి, పంటలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు, వానదారులు కోరుతున్నారు.

ఆదాయం కంటే మరమ్మతుల ఖర్చు ఎక్కువ 

 నేను నిత్యం అలుగునూరు, లింగంపల్లి, నూతనకల్ కి ఆటో నడుపుతున్నాను. రోడ్డుపై అడుగడుగునా గుంతలు ఉన్నాయి. లోన్ పై తీసుకున్న ఆటోకు నెల వారి కిస్తీలు  చెల్లించేందుకు బదులు మెకానిక్ షెడ్ కు చెల్లిస్తున్నాను. ఆటో నడపడం ద్వారా వచ్చిన సంపాదన కంటే, రోడ్డు పుణ్యమా అని వాహన మరమ్మత్తుల ఖర్చే ఎక్కువగా ఉంది. రోడ్డును బాగు చేసి మమ్మల్ని ఆదుకోవాలి.

- ములకలపల్లి సైదులు,  ఆటోడ్రైవర్

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్తా..  

ఈ విషయమును వెంటనే ఉన్నతాదికారుల దృష్టికి తీసుకెళతా. పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకునేందుకు నా వంతు కృషి చేస్తా.

--కళ్యాణ్, పీఆర్ ఏఈ,