27-10-2025 01:15:50 AM
పాల్గొన్న బీజేపీ రాష్ట్ర, స్థానిక నేతలు
మణికొండ, అక్టోబర్ 26, విజయక్రాంతి : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 127వ ’మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ఆదివారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆసక్తిగా వీక్షించాయి. బూత్ నంబర్ 60లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో, ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలపై చర్చించుకున్నారు.
దేశ సాంస్కృతిక వైభవం, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ప్రధాని ప్రధానంగా ప్రస్తావించారు.ముందుగా దీపావళి, బీహార్ వాసులు జరుపుకునే ఛత్ (చేత) పండుగలను గుర్తుచేస్తూ, మన దేశం యొక్క గొప్ప సంస్కృతీ సాంప్రదాయాలను ఈ పండుగలు చాటుతాయని మోడీ పేర్కొన్నారు.
అనంతరం, ఈనెల 22న కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఆ ఆదివాసీ బిడ్డను స్మరించుకున్నారు. 20వ శతాబ్దం మొదట్లోనే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుడిగా కొమరం భీమ్ను కొనియాడారు. అలాగే, అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశ సమగ్రతకు ఆయన చేసిన సేవలను గుర్తుచేశారు.
భారతదేశాన్ని సమగ్రంగా ఏకతాటిపైకి తీసుకువచ్చిన వ్యక్తి పటేల్ అని ప్రధాని వ్యాఖ్యానించారు.ఈ వీక్షణ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి. అంజన్ కుమార్ గౌడ్, మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కొండకల నరేందర్ రెడ్డి, మణికొండ మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షులు బి. రవి కాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కంకణాల శివరాం రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మధు ఓర్స్, పలువురు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.