07-08-2025 12:33:58 AM
కేజీబీవీ ఎస్.ఓ పై కుక్ ఆరోపణలు
పాపన్నపేట, ఆగస్టు 6 : కస్తూర్బా గాంధీ పాఠశాలలో వంటపని చేసేందుకు గాను నియామకం చేసుకుంటామని చెప్పి తన వద్ద 50 వేల రూపాయలను తీసుకొని ఇప్పుడు వేరే వారిని పెట్టుకున్నారని కస్తూర్బా గాంధీ పాఠశాల ఎస్. ఓ పై ఆరోపిస్తూ ఒక మహిళ లేఖను విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే పాపన్నపేట మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మండల పరిధిలోని నార్సింగ్ గ్రామానికి చెందినటువంటి ఉప్పరి పెంటమ్మ వంట మనిషిగా విధులు నిర్వహించేది.
రెండేళ్ల క్రితం పెంటమ్మకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆమె బదులు తన కోడలు నవనీత వంటపని చేసేందుకు గాను వస్తుందని ఇందుకు సహకరించాలని ఎస్.ఓ మమతకు ఏడాది కింద 50 వేల రూపాయలు అందించామన్నారు. అప్పటినుండి తమకు నియామకం ఆర్డర్ ఇప్పించాలని అడిగినప్పుడల్ల దాటావేస్తూ వచ్చిందని నవనీత తెలిపింది.
ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్. ఓ తనను కాకుండా మరొకరిని వంట చేసేందుకు నియమించుకున్నదని తనకు న్యాయం చేయాలనీ ఈ సందర్బంగా నవనీత కోరింది. ఈ విషయమై ఎస్. ఓ మమతను ఫోన్ లో సంప్రదించాలని చూడగా అందుబాటులోకి రాలేదు. ఈ విషయం పై ఉన్నత అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.