calender_icon.png 31 October, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది కోడ్ ఉల్లంఘనే!

31-10-2025 12:41:50 AM

  1. అజార్‌కు మంత్రి పదవి ఇప్పుడెలా ఇస్తారు?
  2. జూబ్లీహిల్స్‌లో ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ ఎత్తుగడ 
  3. ఇది ఓటర్లను ప్రభావితం చేసే చర్యే.. మంత్రివర్గ విస్తరణను ఆపాలి
  4. ఎస్‌ఈసీకి బీజేపీ నేతల ఫిర్యాదు
  5. ఎలా స్పందించాలన్న అంశంపై సీఈసీకి ఎస్‌ఈసీ లేఖ

హైదరాబాద్, సిటీ బ్యూరో అక్టోబర్ 30 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ మాజీ క్రికెటర్, కాం గ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టబోతున్నారం టూ వస్తున్న వార్తలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతు న్నాయి. ఇది కేవలం ఓటర్లను, ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గాన్ని ప్రలోభపెట్టేందుకేనని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కోడ్ పూర్తిగా ఉల్లంఘించడమేనని బీజేపీ తీవ్రంగా ఆరోపించింది.

ఈ మేరకు గురువారం బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్, సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలోని బృందం రాష్ర్ట ఎన్నికల ప్రధాన అధికారి(ఎస్‌ఈసీ) సుదర్శన్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నాయని పలు సర్వేల్లో వెల్లడవడం తోనే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానం అనుమతి లేకుండా అజారు ద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తున్నట్లు మీడియాకు లీకులు ఇచ్చారని బీజేపీ నేతలు ఆరోపించారు.

రాష్ర్టంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా, ఇన్నాళ్లూ లేని మైనారిటీల మీద ప్రేమ ఉప ఎన్నిక ముంగిట ఎందుకు పుట్టుకొచ్చిందని వారు ప్రశ్నించారు. ఇది పూర్తిగా ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నమేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచే పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్‌కు ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడం వెనుక స్పష్టమైన రాజకీయ ప్రయోజనం ఉందని బీజేపీ నేతలు ఆరోపించారు.

ఎన్నికల కోడ్ కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైనప్పటికీ, మంత్రివర్గ విస్తరణ అనేది రాష్ర్టస్థాయి నిర్ణయం గనుక, అది కచ్చితంగా అక్కడి ఓటర్లను ప్రభావితం చేస్తుందని వారు వాదించారు. ఈ మంత్రివర్గ విస్తరణ ప్రక్రియను ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పరిగణించి, ప్రమాణ స్వీకారాన్ని తక్షణమే నిలిపివేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

ఈ వ్యవహారంపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై స్పష్టత కోసం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాని(సీఈసీ)కి గురువారం లేఖ రాశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మంత్రిగా అజారుద్దీన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.