23-11-2025 12:45:51 AM
ఒకప్పుడు ఇండియా అంటే క్రికెట్‌లోనే విశ్వ విజేతలు..చారిత్రక విజయాలు...అద్భుత ప్రదర్శనలు.. అయితే కాలం మారేకొద్దీ క్రికెట్ తరహాలోనే ఒలింపిక్ క్రీడల్లోనూ మన క్రీడాకారుల హవా మొదలైంది. బ్యాడ్మింటన్, టెన్నిస్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్.. ఇలా పలు క్రీడల్లో మన సత్తా అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఈ విజయాలు కేవలం కొన్ని రోజులకే పరిమితం కావడం లేదు.
మెగాటోర్నీల్లో మన క్రీడాకారుల ప్రతిభ కనపిస్తూనే ఉంటోంది. తాజాగా బాక్సింగ్‌లో మన హవా మరో స్థాయికి చేరింది. ముఖ్యంగా మహిళల బాక్సింగ్‌లో ఇండియా ఆధిపత్యానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. గ్రేటర్ నోయిడా వేదికగా ముగిసిన వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో మన బాక్సర్ల ప్రదర్శనే దీనికి ఉదాహరణ.
మహిళల విభాగంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు స్వర్ణాలు కైవసం చేసుకున్న భారత బాక్సర్లు తమ పంచ్ పవర్ రుచి చూపించారు. సొంతగడ్డపై అదిరిపోయే ప్రదర్శన కనబరిచారు. జైస్మిన్ లాంబోరియా, అరుంధతి చౌదరి, నిఖత్ జరీన్, పర్వీన్, నుపుర్, ప్రీతి పన్వర్, మీనాక్షి పసిడి పంచ్‌లు విసిరారు. భారత బాక్సింగ్ చరిత్రలోనే ఇది అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.
మెరిసిన మీనాక్షి.. ప్రీతి పంచ్ పవర్
ఈ వరల్డ్ బాక్సింగ్ కప్‌లో మరికొందరు బాక్సర్లు కూడా అదరగొట్టి స్వర్ణాలు గెలుచుకున్నారు. ప్రపంచ ఛాంపియన్ మీనాక్షి హుడా 48 కేజీల విఙాగంలో గోల్డ్ గెలిచింది. ఫైనల్స్‌లో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ ఫర్జోనాపై మీనాక్షి 5 తేడాతో గెలిచింది. ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తర్వాత అంచనాలను నిలబెట్టుకోవడం చాలా కష్టం. అయితే వరల్డ్ బాక్సింగ్ కప్‌లో వ్యూహాత్మకంగా ఆటతీరు కనబరచి సక్సెస్ అయ్యానని మీనాక్షి చెప్పుకొచ్చింది.
అలాగే 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్ కూడా గోల్డెన్ పంచ్ విసిరింది. ఫైనల్స్‌లో ఇటలీ బాక్సర్‌కు చుక్కలు చూపించిన ఆమె అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి స్వర్ణం సాధించింది. వీరితో పాటు జైస్మిన్ లాంబోరియా, పర్వీన్, నుపుర్, ప్రీతి పన్వర్ కూడా స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. ఓవరాల్‌గా ఈ పోటీల్లో భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది.
బాక్సింగ్ పవర్ హౌస్‌గా పేరున్న కజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ బాక్సర్లను వెనక్కి నెట్టి పోడియంపై స్వర్ణపతకాలతో నిలబడడం గొప్ప విషయంగానే చెప్పాలి. గాయాల నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన సీనియర్ మహిళా బాక్సర్లు అంచనాలను అందుకోవడం మరో సానుకూలమైన అంశంగా చెప్పొచ్చు.
అయితే ఇక్కడ నుంచి అసలైన సవాల్ మొదలవుతుందని చెబుతున్నారు. ఎందుకంటే తర్వాత రెండేళ్లు ఒలింపిక్స్‌కు ముందు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. పలు అంతర్జాతీయ టోర్నీల్లో ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తేనే ఒలింపిక్స్‌లో పతకాలపై ఆశలు పెట్టుకోవచ్చు.
ఐదురోజుల పాటు జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్‌లో 8 దేశాలకు చెందిన 130 మందికి పైగా ఎలైట్ బాక్సర్లు పాల్గొన్నారు. సొంత ప్రేక్షకుల మధ్య మన బాక్సర్లు అదరగొట్టేశారు. మహిళల, పురుషుల విభాగాల్లో కలిపి ఏకంగా 15 మంది ఫైనల్స్‌కు చేరగా..20 పతకాలు వచ్చాయి.
దీనిలో తొమ్మిది స్వర్ణాలు, ఆరు రజతాలు, ఐదు కాంస్యాలు ఉన్నాయి. ముఖ్యంగా మన మహిళా బాక్సర్ల ప్రదర్శన నభూతో నభవిష్యత్ అన్నట్టుగా సాగింది. ఎందుకంటే మన బాక్సర్లు సాధించిన విజయాలు ఎవరో సాదాసీదా బాక్సర్లపై కాదు.. అప్పటికే ఇలాంటి టోర్నీల్లో అత్యుత్తమ ప్రదర్శనలతో నిలిచిన బాక్సర్లను చిత్తు చేశారు.
నిఖత్ పసిడి పంచ్
ఈ ప్రదర్శనల్లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ ప్రదర్శన అద్భుతమనే చెప్పాలి. భుజం గాయంతో దాదాపు ఏడాదికి పైగా బాక్సింగ్ రింగ్‌కు దూరమైన నిఖత్ ఈ మెగా టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఒక అంతర్జాతీయ స్థాయి టోర్నీలో బరిలోకి దిగితే ఎలాంటి అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంచనాలతో పాటే ఒత్తిడి కూడా ఉంటుంది. ఆ ఒత్తిడి తట్టుకోవడంతో పాటు ప్రదర్శనలోనూ తనదైన ముద్ర వేస్తేనే విజయం దక్కుతుంది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన నిఖత్ అదరగొట్టేసింది.
ఫైనల్స్‌లో అయితే నిఖత్ పంచ్ పవర్‌కు ప్రత్యర్థి దగ్గర సమాధానమే లేకుండా పోయింది. 51 కేజీల విభాగంలో బరిలోకి దిగిన నిఖత్‌కు బై లభించడంతో నేరుగా సెమీఫైనల్ ఆడడం కూడా అడ్వాంటేజ్‌గా మారింది. సెమీస్, ఫైనల్స్‌లో తనదైన పంచ్‌లతో ప్రత్యర్థులను చిత్తు చేసి 21 నెలల తర్వాత పసిడి పతకాన్ని ముద్దాడింది. ఈ విజయం తర్వాత నిఖత్ ఎమోషనల్‌గా మాట్లాడింది.
గాయం కారణంగా దాదాపు ఏడాదిన్నర పాటు కఠిన పరిస్థితులను ఎదుర్కొని సాధించిన విజయం కావడంతో ఉద్వేగానికి గురైంది. గత ఒలింపిక్స్ వైఫల్యాన్ని మరిపిస్తూ తాజా ప్రదర్శనతో భవిష్యత్తుపై నిఖత్ ఆశలు రేకెత్తించింది. ఈ సందర్భంగా తెలంగాణలో యువ బాక్సర్ల కోసం అకాడమీ పెట్టబోతున్నట్టు ప్రకటించింది. వచ్చే ఏడాది జరిగే ఆసియా గేమ్స్, తర్వాత కామన్‌వెల్త్‌గేమ్స్‌తో పాటు 2028లో జరిగే ఒలింపిక్స్‌లో స్వర్ణపతకాలు గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
అదరగొట్టిన అరుంధతి
నిఖత్ జరీన్ తరహాలోనే మరో బాక్సర్ అరుంధతి చౌదరిది కూడా ఇదే పరిస్థితి. గాయం నుంచి కోలుకుని దాదాపు ఏడాదిన్నర తర్వాత రింగ్‌లోకి అడుగుపెట్టిన అరుంధతి కూడా ఈ మెగాటోర్నీలో దుమ్మురేపింది. 70 కేజీల విభాగంలో స్వర్ణం కైవసం చేసుకుంది. సెమీఫైనల్లో జర్మనీకి చెందిన ట్రిపుల్ మెడలిస్ట్ ముల్లర్‌కు షాకిచ్చింది. తర్వాత ఫైనల్స్‌లో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ అజీజాపై విజయం సాధించింది.