calender_icon.png 8 July, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదేళ్లలో బాగుపడ్డది ఆ నలుగురే

08-07-2025 01:56:01 AM

- కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు రోడ్డు 

- జుక్కల్‌ను ఎందుకు పట్టించుకోలేదు?

- మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

కామారెడ్డి, జూలై 7 (విజయక్రాంతి): తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌లో బాగుపడ్డది నలుగురేనని రోడ్లు భవనాల, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.

మధ్యల చెరువు పిట్లం రోడ్డు తిమ్మానగర్ వద్ద 4.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించారు. బిచ్కుంద డోంగ్లీ వరకు 13.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు పిట్లం, బిచ్కుందలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

బిచ్కుందలో బండాయప్ప కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. కేసీఆర్ కూతురుకు ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చి నిరుద్యోగులను విస్మరించారన్నారు. గత పదేళ్లలో కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్‌తోపాటు ఆయన కొడుకు, బిడ్డ, అల్లుడు బాగుపడ్డారు కానీ తెలంగాణ ప్రజలు బాగుపడలేదన్నారు.

ఏనాడు విద్య గురించి ఆలోచించలేదని మండిపడ్డారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఐదు లక్షలు ఇందిరమ్మ ఇల్లు పేదవారికి అందిస్తున్నదన్నారు. నిరంతరం తమను విమర్శించే హరీశ్‌రావు మంత్రిగా ఉన్నప్పుడు జుక్కల్ అభివృద్ధిని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. నారాయణఖేడ్‌కు 240 కోట్లతో రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు వేశామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. లెండి నాగమ డుగు ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు.

జుక్కల్‌లో డైనమిక్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఉన్నారని, అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ఆయనకు తోడుగా ఉంటానని, జుక్కల్ అభివృద్ధి బాధ్యత తనదేనని మంత్రి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఇన్‌చార్జి మంత్రి సీతక్క తో మాట్లాడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సెట్విన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కైలాస శ్రీనివాసరావు పాల్గొన్నారు.